Breaking News

జనవరిలో టీకా పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం.. కేంద్ర ఆరోగ్య మంత్రి


దేశంలో కరోనా వైరస్‌కు టీకా పంపిణీకి మార్గదర్శకాలకు విడుదల చేసిన కేంద్రం.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే, టీకా ఎప్పుడు పంపిణీ ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రారంభంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జనవరిలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే, టీకా సామర్థ్యం, భద్రతకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ‘వ్యక్తిగతంగా జనవరిలో ఏ దశలోనైనా.. ఏ వారంలోనైనా టీకా అందుబాటులో ఉండవచ్చు.. దేశ ప్రజలకు మొదటి కోవిడ్ వ్యాక్సిన్ షాట్ ఇచ్చే స్థితిలో మనం ఉండగల సమయం ఆసన్నమయ్యింది’ అని అన్నారు. దేశంలో టీకా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసిన వ్యాక్సిన్ సంస్థల ఫలితాల నివేదికలను సంబంధిత విభాగాలు క్షుణ్నంగా సమీక్షిస్తున్నాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి విషయంలో మిగతా దేశాలకు భారత్ ఏమాత్రం తీసిపోదని డాక్టర్ హర్ష్‌వర్దన్ వ్యాఖ్యానించారు. టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతకు ముందు శనివారం కోవిడ్‌పై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం 22వ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా టీకాను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు మన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంతో కృషి చేశారని తెలిపారు. రాబోయే 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకా వేయనున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. దేశంలో తొమ్మిది వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలో ఆరు క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉండగా.. మరో మూడు ప్రీ క్లినికల్‌ దశలో ఉన్నాయి. కోవిషీల్డ్, కొవాగ్జిన్, జైకోవ్-డి, స్పుత్నిక్-వీ, ఎన్వీఎక్స్-కోవి2373, ప్రొటీన్ యాంటీజెన్ ఆధారిత టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.


By December 21, 2020 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-may-start-covid-vaccinating-people-in-january-says-harsh-vardhan/articleshow/79834255.cms

No comments