Breaking News

సినిమాల్లో బౌన్సర్.. బయటికొస్తే బాబోయ్.. కేటుగాడి అరెస్ట్


సినిమాల్లో బౌన్సర్‌గా పనిచేసిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీ మనీ కోసం దొరికినచోటల్లా అప్పులు చేశాడు. తీరా అవి తీర్చలేక చోరీల బాట పట్టాడు. అది బాగా గిట్టుబాటు అయ్యిందనకున్నాడో ఏమో వరుస దొంగతనాలతో హడలెత్తించాడు. పోలీసులు అరెస్టు చేసి పలుమార్లు జైలుకి పంపినా మార్పు రాలేదు. మరోసారి దొంగతనం కేసులో పోలీసుల చేతికి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్‌కు చెందిన బలిజ విక్కీ(29) ఈసీఐఎల్‌ సౌత్‌ కమలానగర్‌కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత సినిమా షూటింగుల్లో బౌన్సర్‌గా పనిచేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన విక్కీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆన్‌లైన్‌లో వివిధ రుణ యాప్‌ల్లో ఎక్కువ మొత్తంలో అప్పు లు చేశాడు. అప్పుల నుంచి గట్టెక్కేందుకు దొంగగా మారాడు. గత ఐదేళ్లుగా బంజారాహిల్స్‌, కుషాయిగూడ, కీసర, నల్లకుంట, మలక్‌పేట, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇప్పటికి సుమారు 19 కేసుల్లో జైలుకు కూడా వెళ్లాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. 2018లో నిందితుడిపై ఓయూ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకి పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. మూడు నెలల్లో మేడిపల్లి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో 6 దొంగతనాలకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం చెంగిచర్ల చౌరస్తా నుంచి బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న విక్కీని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో దొంగతనాల విషయం బయటపడింది. నిందితుడి నుంచి రూ.6 లక్షల విలువైన 11 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. Also Read:


By December 27, 2020 at 03:52PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/malkajgiri-police-arrest-thief-recovers-rs-6-lakh-worth-gold/articleshow/79977284.cms

No comments