కరోనాతో వెన్నులో వణుకు.. ముందుగానే చైనా టీకా వేయించుకున్న కిమ్
అధినేత కిమ్ జోంగ్ రూటే సపరేటు.. ప్రపంచమంతా ఓ దారిలో పయనిస్తుంటే ఆయన మాత్రం మరో దారిలో వెళతారు. అయితే, అందర్నీ భయపెట్టే కిమ్.. కరోనా పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. మహమ్మారి వెలుగులోకి రాగానే సరిహద్దుల్ని మూసివేసిన దేశాల్లో ఉత్తర కొరియా ముందు వరసులో ఉంది. దాదాపు అన్ని దేశాల నుంచి ప్రయాణాల్ని నిషేధించారు. కేసాంగ్ నగరంలోకి ఓ వ్యక్తి చైనా నుంచి వచ్చాడనే అనుమానంతో ఏకంగా ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. వుహాన్‌లో వైరస్ వెలుగులోకి రాగానే కిమ్ సర్కార్ అప్రమత్తమైంది. మెరుగైన వైద్య సదుపాయాలున్న చైనాయే వైరస్ ధాటికి విలవిల్లాడుతుంటే కిమ్ వణికిపోయారు. తాజాగా, కరోనా వైరస్‌కు ఆయన టీకా వేయించుకున్నట్టు అమెరికా నిపుణుడు వెల్లడించారు. కిమ్ సహా ఆయన కుటుంబం, కీలక అధికారులు కరోనా టీకా వేయించుకొన్నారని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ సంస్థకు చెందిన హారీ కజియానిస్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా వ్యవహారాలపై పరిశోధనలు చేసే కజియానిస్.. ఈ టీకాను చైనా అందజేసిందని తెలిపారు. ఈ విషయాన్ని జపాన్ నిఘా వర్గాలకు చెందిన ఇద్దరు అధికారులు ద్వారా తెలిసిందని అన్నారు. ‘గత రెండు మూడు వారాల కిందట , ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులు కరోనాకు వ్యాక్సిన్ వేయించుకున్నారు.. వ్యాక్సినేషన్‌కు సహకరించిన చైనా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు’ అని కజియానిస్ తెలిపారు.అయితే, చైనాలో అభివృద్ధి చేస్తున్న వాటిలో ఏ టీకాను కిమ్ వినియోగించారో స్పష్టంగా చెప్పలేదు. చైనా అభివృద్ధి చేస్తున్న ఏ వ్యాక్సిన్‌కూ ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం చైనాకు చెందిన సైనోవ్యాక్, కెన్‌సినోబయో, సినోఫార్మా సహా కనీసం మూడు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఉన్నట్టు అమెరికా మెడికల్ సైంటిస్ పీటర్ జే హోట్జే అన్నారు. తమ దేశంలోని దాదాపు 10 లక్షల మందికి ఇప్పటికే తమ టీకాను అందజేశామని సినోఫార్మా ప్రకటించింది. అయితే, చైనాలో కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికారులు చేస్తున్న ప్రకటనలపై అమెరికా నిఘా సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. చైనీయులతో నేరుగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశాలు దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయోగ దశల్లో ఉన్న వివిధ టీకాల సమాచారాన్ని తస్కరించడానికి సైబర్ దాడులు చేసినట్టు ఇటీవల మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఏ సంస్ధలపై వీరు దాడులు చేశారనే విషయం మాత్రం వెల్లడించలేదు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రాజెనెకాపై సైబర్ దాడి జరిగినట్లు మాత్రం ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.
By December 01, 2020 at 01:02PM
No comments