Breaking News

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. స్పీడ్ పోస్ట్ ద్వారా శబరిమల ప్రసాదం.. ధర ఎంతంటే?


అయ్యప్పస్వామి దర్శనం కోసం దేశంలోని లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివస్తారు. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా పరిమితి సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు చేరవేయడానికి తపాలా శాఖ ముందుకొచ్చింది. శబరిమల దేవాలయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని స్పీడు పోస్టు ద్వారా భక్తులకు చేరవేయనున్నారు. తపాలా శాఖ తన విస్తృత నెట్‌వర్క్‌ ద్వారా దేశం నలుమూలల ఉన్న భక్తులకు ప్రసాదాన్ని ఇంటి దగ్గరకే డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుతో కేరళ పోస్టల్ సర్కిల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ పోస్టాఫీస్‌లో అయినా శబరిమల ప్రసాదం కోసం రూ.450 చెల్లించి భక్తులు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్‌లో అరవణ ప్రసాదంతోపాటు విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం నేయి ఉంటాయి. ఒక భక్తుడు ఒకేసారి పది ప్యాకెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదం బుక్ చేసుకోగానే వెంటనే రిజిస్ట్రేషన్ నెంబరుతో కూడిన మెసేజ్ వస్తుంది. ఈ నెంబరు ఆధారంగా ప్రసాదం పార్శిల్‌ను ట్రాక్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు అయ్యప్ప ప్రసాదం కోసం 9 వేల మంది భక్తులు బుక్ చేసుకున్నారు. సుదీర్ఘ మండల, మకర విళక్కు పూజల కోసం నవంబరు 16న శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచిన విషయం తెలిసిందే. అయితే, కోవిడ్ వ్యాప్తి కారణంగా కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. రోజుకు కేవలం 1,000 మంది భక్తులకే అనుమతిస్తున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో గరిష్ఠంగా ఐదు వేల మందికి అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఇప్పటికే జనవరి 20 వరకు ఆన్‌లైన్ బుకింగ్ పూర్తయింది. ఆలయ చరిత్రలో మండల, మకరు విళక్కు సీజన్‌లో ఇంత తక్కువ సంఖ్యలో భక్తులను అనుమతించడం ఇదే తొలిసారి. కరోనా కారణంగా ఏడు నెలల పాటు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయగా.. తొలిసారి అక్టోబరు 16న మండల పూజలకు ఐదు రోజుల పాటు తెరిచారు.


By December 02, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-temple-to-deliver-ayyappa-prasadam-for-devotees-through-speed-post/articleshow/79523313.cms

No comments