సూపర్ సైనికుల సృష్టికి చైనా జీవశాస్త్ర పరీక్షలు.. అమెరికా నిఘాలో వెల్లడి
తమ దేశ రహస్యాలను తస్కరించి, దొడ్డిదారిలో ఎదగాలని దశాబ్దాలుగా చైనా ప్రయత్నిస్తోందని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పని, ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో తమపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి ఘర్షణకు దిగుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో ర్యాట్‌క్లిఫ్ దుయ్యబట్టారు. అగ్రరాజ్యం రహస్యాలను దొంగిలించి ఎదగాలని, మార్కెట్లో అమెరికా సంస్థల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అమెరికా మేధో హక్కులను దొంగిలించడంతోనే ట్రంప్ యంత్రాంగం చైనా వస్తువులు, ఉత్పత్తులపై అధిక పన్నులు, టారిఫ్‌లు విధించిందని ర్యాట్‌క్లిఫ్ అన్నారు. ‘అమెరికానే కాదు ప్రపంచం మొత్తం మీద ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుగుణంగానే ఆ దేశానికి చెందిన కంపెనీలు పనిచేస్తాయి. అందులో పనిచేసే సిబ్బందిని అడ్డుపెట్టుకుని డ్రాగన్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకొనేలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన ఆరోపించారు. త్వరలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు చైనా.. ఆసియాపై సైనికదాడికి దిగే అవకాశముందని హెచ్చరించారు. అమెరికాతో బహిరంగ ఘర్షణకు దిగాలని చైనా భావిస్తోందని, ఇందుకు వాషింగ్టన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. నాయకులు విడిపోకుండా ఐక్యతతో ముప్పును గ్రహించి దాని గురించి మాట్లాడి, పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని ర్యాట్‌క్లిప్ పేర్కొన్నారు. అలాగే, జీవశాస్త్రపరంగా మెరుగైన సైనికులను సృష్టించాలనే ఆశతో చైనా తన సైన్యంపై పరీక్షలు నిర్వహించిందని, ఈ విషయం తమ నిఘా వర్గాలు గుర్తించాయని ఆరోపించారు. చైనాపై దృష్టి పెట్టడానికి ఇంటెలిజెన్స్ బడ్జెట్‌లో వనరులను మార్చామని తెలిపారు. ‘ప్రభుత్వ నిఘా విభాగంలోని విశ్లేషకులు, అధికారులు ఇప్పటి వరకు రష్యా, తీవ్రవాద నిరోధంపైనే దృష్టి పెట్టారు.. కానీ, ఈ రోజు మనం మన ముందు ఉన్న వాస్తవాలను స్పష్టమైన కళ్లతో చూడాలి.. ఇది చైనాను ప్రాథమికంగా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని స్పష్టంగా చెబుతుంది’అని వ్యాఖ్యానించారు. చట్టం అమలు లేదా సైనిక కార్యకలాపాలలో నిమగ్నమైన సాధారణ మానవుల వృద్ధి అనే అంశం అధారంగా పలు సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ చిత్రం యూనివర్సల్ సోల్జర్ చిత్రం జన్యుపరంగా అభివృద్ధి చెందిన సైనికుల కథను ఇతివృత్తంగా తీసుకున్నారు. త్వరగా కోలుకోవడం, సాధారణ మానవుల కంటే బలంగా ఉంటాయి. రోబోకాప్ సినిమాలో హత్యకు గురైన ఒక పోలీస్ అధికారి మెదడు, శరీరంతో శాస్త్రవేత్తలు శక్తివంతమైన సైబోర్గ్ పోలీసులను సృష్టిస్తారు.
By December 05, 2020 at 07:36AM
No comments