Breaking News

ఎట్టకేలకు మొండితనం వీడి ఆ బిల్లుపై ట్రంప్ సంతకం.. కోటి మందికి లబ్ది!


కట్టిడి విషయంలో అనాలోచిత నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు.. పదవి నుంచి దిగిపోయే ముందు తన వైఖరిని మార్చుకుంటున్నారు. మహమ్మారి కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్దించే ఉద్దీపన బిల్లు విషయంలో ట్రంప్ మంకుపట్టు వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉద్దీపన బిల్లుపై ట్రంప్ సంతకం చేయడంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది. ట్రంప్ మొండితనం వీడటంతో భారీ సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కింది. నిన్నటి వరకు సంతకం చేసేది లేదంటూ ట్రంప్ భీష్మించుకు కూర్చోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అధికార పగ్గాలు చేపట్టే వరకు తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని భావించారు. కానీ, ట్రంప్‌ తన మనసు మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉద్దీపన బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయడంతో నిరుద్యోగ ప్రాయోజిత పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద నిరుద్యోగులకు అందుతున్న ఆర్ధిక సాయం మరో 11 వారాలు కొనసాగనుంది. వచ్చే శనివారంతో ఈ పథకాలకు గడువు ముగియనుండగా.. తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో అందరికీ ఊరట కలిగింది. కరోనా సృష్టించిన విలయంతో భారీగా నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సహాయం అందించాలన్న ప్రతిపాదనతో 900 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.66.37 లక్షల కోట్లు) ప్యాకేజీతో కూడిన బిల్లును అమెరికా కాంగ్రెస్ గతంలోనే ఆమోదించింది. కానీ, అనూహ్యంగా ట్రంప్‌ దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. చిరు వ్యాపారులు, పౌరులకు 600 డాలర్ల(రూ.44వేలు) ఆర్థిక సహాయం సరిపోదని, దాన్ని రెండు వేల డాలర్ల(రూ.1.47లక్షలు)కు పెంచాలంటూ ఆచరణ సాధ్యంకాని సూచనలతో కొర్రీలు వేశారు. నెలలుగా ట్రంప్ ఈ బిల్లుపై తాత్సారం చేయడంతో ఆమోదంపై సందిగ్ధత నెలకుంది. ఎట్టేకేలకు ఆయన మొండివైఖరి వీడి బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆర్ధిక ఉద్దీపన బిల్లుపై సంతకం చేసినట్టు ఆదివారం అర్ధరాత్రి ప్రకటించారు. ఈ బిల్లుపై సంతకం చేయడానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఓమ్నిబస్,కోవిడ్ ప్యాకేజీపై నేను బలమైన సందేశంతో సంతకం చేస్తాను.. అది వ్యర్థమైన వస్తువులను తొలగించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌కు స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఉపశమన ప్రక్రియలో తొలగించాల్సిన రెడ్ మార్క్ చేసిన అంశాలను కాంగ్రెస్‌కు పంపుతానని ట్రంప్ అన్నా.. అవి కేవలం కాంగ్రెస్‌కు సూచనలు మాత్రమే. బిల్లుపై సంతకం చేసిన తర్వాత వాటిని మార్చలేరు. అధ్యక్షుడు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి కాంగ్రెస్ సమావేశం కానుంది. డెమొక్రాట్లకు ఆధిపత్యం ఉన్న పెద్దల సభ బిల్లును పరిశీలించడానికి మద్దతు ఇస్తుంది.. సోమవారం ఈ అంశంపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది.. కానీ రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న సెనేట్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది.


By December 28, 2020 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trump-signs-massive-measure-funding-government-covid-relief/articleshow/79985623.cms

No comments