Breaking News

జనవరిలో ఆక్స్‌ఫర్డ్ టీకాకు ఆమోదం కష్టమే.. ఐరోపా సమాఖ్య సంచలన వ్యాఖ్యలు


ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి అనుమతి విషయంలో ఐరోపా సమాఖ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీకాను తక్షణం అనుమతించే అవకాశాలు లేవని యూరోపియన్ యూనియన్ అధీనంలోని ఔషధ నియంత్రణ సంస్థ ఈఎంఏ (యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ) స్పష్టం చేసింది. ఈఎంఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోయల్ వాటియన్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. బెల్జియం పత్రిక హెట్ న్యూస్ బ్లాడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్‌పై ఇంకా పూర్తి సమాచారం తమకు చేరలేదని పేర్కొన్నారు. తమ టీకాను అనుమతించాలని కోరుతూ ఇప్పటివరకూ ఆ సంస్థ దరఖాస్తు కూడా చేసుకోలేదని వాటియన్ తెలిపారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకాకు నిబంధనలతో కూడిన మార్కెటింగ్ లైసెన్స్ ఇవ్వడానికి అవసరమైన గణాంకాలు కూడా అందలేదని ఆయన వివరించారు. వ్యాక్సిన్‌పై మరింత సమాచారం అందాల్సి ఉందని, ఆ తరువాతే తాము ఓ నిర్ణయానికి రాగలమన్నారు. ఇందుకు కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. ఇదిలా ఉండగా, తాము తయారుచేసిన వాక్సిన్ కరోనా నుంచి 100 శాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెన్‌కా సీఈఓ పాస్కల్ గతవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొత్త రకం స్ట్రెయిన్ నుంచి కూడా ఇది రక్షిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు, బ్రిటీష్ ఔషధ రెగ్యులేటరీకి ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా టీకా క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాల డేటా ఇప్పటికే చేరింది. ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హన్‌కాక్ తెలిపారు. దీంతో అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతులు లభించవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఈఎంఏ ఈడీ నోయల్.. బ్రిటన్ అధికారులకు చేరిన సమాచారం కూడా తమ వద్ద లేదని పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకాకు సంబంధించి స్వల్ప సమాచారం మాత్రమే తమ వద్దకు చేరిందన్నారు. బ్రిటన్ ప్రభుత్వం టీకాకు అనుమతిస్తే, ఐరోపా సమాఖ్యలోని మిగతా దేశాల్లో కొన్ని పరిమితులతో వ్యాక్సిన్ పంపిణీకి అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏదిఏమైనా ఆ సంస్థ అధికారికంగా అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అత్యుత్తమ నాణ్యమైన టీకాను ప్రజలకు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన సుస్పష్టం చేశారు. ఈయూ దేశాలకు తొలి దశలో 30 కోట్ల డోస్‌లు, రెండో దశలో మరో 10 కోట్ల డోస్‌లను సరఫరా చేసేందుకు ఆగస్టులోనే ఆస్ట్రాజెనికా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటు, భారత్‌లోనూ అత్యవసర వినియోగానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. సీరమ్ ఆధ్వర్యంలోనే ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలు భారత్‌లో కొనసాగుతున్నాయి. బ్రిటన్‌లో ఈ టీకాకు అనుమతి లభించిన వెంటనే.. భారత్‌లోనూ ఆమోదం పొందనుంది. త్వరలోనే బ్రిటన్ నుంచి శుభవార్త వింటామని సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా వ్యాఖ్యానించారు.


By December 30, 2020 at 11:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/oxford-coronavirus-vaccine-may-not-get-market-approval-by-jan-says-eu-official/articleshow/80022950.cms

No comments