బెంగాల్‌లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు.. మమతకు మరో కొత్త సవాల్
బెంగాల్‌లో ఒకప్పుడు వెలుగువెలిగిన కమ్యూనిస్టులతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమయ్యింది. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సీఎం నాయకత్వంలోని తృణమూల్‌కు ఇది ఓ రకంగా ఇబ్బందికరమే. రాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీను అడ్డుకోడానికి మమతా తీవ్రంగా పోరాటం చేస్తుండగా.. ఇప్పుడు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటం మరింత ఎదురీత తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీ, బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడానికి తోడ్పడుతుందని అంటున్నారు. కేరళలో ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయ వైరుధ్యాన్ని పక్కనబెట్టి బెంగాల్‌లో చేతులు కలుపుతున్నాయి. గత బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీచేశాయి.. కానీ తర్వాత విబేధాలు తలెత్తడంతో వేరుపడ్డాయి. కొంతకాలంగా రాష్ట్రంలో ఇరు పార్టీలు సంయుక్తంగా కార్యక్రమాలు చేపడుతుండగా.. బెంగాల్ పీసీపీ అధ్యక్షుడు, ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పొత్తులపై ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత నెలలో రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్‌ఛార్జి జితిన్ ప్రసాద్‌తో జరిగిన ఆన్‌లైన్ భేటీలో కూటమిని లాంఛనప్రాయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వివరించారని అధీర్ రంజన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకోవడంతో కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. తృణమూల్ కోటను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకోవడంలో లౌకిక పార్టీలు విఫలమయ్యాయని, బీజేపీ ప్రయత్నాలకు వామపక్షాలు వెన్నుదన్నుగా నిలిచాయని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి లోపాయికారిగా వామపక్షాలు సహకరించాయనే వాదన బలంగా వినిపించింది.
By December 25, 2020 at 08:10AM
No comments