Breaking News

యూపీ: బెయిల్ వచ్చినా 8 నెలల జైల్లోనే ఖైదీ నిర్బంధం.. కారణం తెలిస్తే షాక్


ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన ఎనిమిది నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా.. అందులో పూర్తి పేరు లేదనే కారణంతో జైలు సూపరింటెండెంట్ అతడిని విడుదలకు మోకాలడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా జైలులో చోటుచేసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం.. వినోద్ కుమార్ బరువార్ అనే వ్యక్తిని ఓ కేసులో కస్టడీకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. దీంతో అతడు 2019 సెప్టెంబర్ 4న బెయిల్ కోసం సిద్ధార్థ్‌నగర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. అయితే, అతడి అభ్యర్థనను సదరు కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో అలాహాబాద్ హైకోర్టు తలుపుతట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్ 20న వినోద్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అతడిని విడుదల చేయాలని సూచించింది. అయితే, కోర్టులకు చేసుకున్న బెయిల్ పిటిషన్‌లో అతడి పేరు వినోద్ బరువార్‌గా పేర్కొన్నారు. కానీ జైలు రికార్డుల్లో మాత్రం వినోద్ కుమార్ బరువార్‌ పూర్తి పేరు ఉంది. ఈ సాంకేతిక లోపమే వినోద్ కొంప ముంచింది. బెయిల్ పత్రాల్లో పేరు పూర్తిగా లేనందున వినోద్‌ను విడుదల చేయడానికి జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు. దీంతో బాధితుడు ఎనిమిది నెలలు జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన వినోద్.. బెయిల్ పత్రాల్లో పేరు మార్చి, విముక్తి కల్పించాలని న్యాయమూర్తులను వేడుకున్నాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు సూపరింటిండెంట్‌కు సమన్లు జారీచేస్తూ, దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. అంతేకాదు, దీనిపై శాఖాపరమైన విచారణకు ఎందుకు ఆదేశించరాదో చెప్పాలని మండిపడింది. పూర్తి పేరు లేకపోవడంతో తాము విడుదల చేయలేకపోయామని అధికారుల వాదనను తోసిపుచ్చింది. ఖైదీ పేరులో ఒక పదం లేనంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏమిటి? అతడి గుర్తింపుకు సంబంధించి ఇది పెద్ద అనుమానాలకు తావివ్వడం లేదు కదా? అని జైలు అధికారులను నిలదీసింది. ఇటువంటి సాంకేతిక కారణాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని జైలు సూపరింటెండెంట్‌కు అక్షింతలు వేసింది. దీంతో జైలు అధికారులు డిసెంబరు 8న వినోద్‌ను విడుదల చేశారు. ‘జైలు సూపరింటెండెంట్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు పరిశీలించింది.. కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు ఇచ్చిన వివరణ, పర్యవసానంగా దరఖాస్తుదారుని విడుదల చేయడంలో జాప్యం అసంతృప్తికి గురిచేసింది.. జైలు సూపరింటెండెంట్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించినా భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం’ అని జస్టిస్ జేజే మునిర్ అన్నారు.


By December 21, 2020 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-man-kept-in-jail-for-8-months-as-his-middle-name-was-missing-from-bail-order/articleshow/79834887.cms

No comments