Breaking News

కొవాగ్జిన్‌తో 6 నెలల నుంచి ఏడాది వరకు యాంటీబాడీలు


హైదరాబాద్‌కు చెందిన ఫార్మ దిగ్గజనం భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేసిన కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’తీసుకున్న వారికి యాంటీ-బాడీలు ఆరు నెలల నుంచి ఒక ఏడాది కాలం పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్ ప్రకారం.. ఈ టీకా వల్ల దీర్ఘకాలిక ‘యాంటీ-బాడీ, టీ-సెల్‌ మెమరీ రెస్పాన్స్‌’ సాధ్యమని మెడ్‌రెగ్జివ్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌ ఒక పరిశీలనా పత్రంలో వివరించింది. ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కొవాగ్జిన్‌ వేసుకున్న వాలంటీర్లలో మూడు నెలల తర్వాత ఇటువంటి సానుకూల ఫలితాలను శాస్త్రవేత్తలు గుర్తించినట్లు పేర్కొంది. ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్ ఫలితాల ప్రకారం ఈ టీకా సమర్ధవంతమైందని కూడా నిర్థారణ అయినట్టు వివరించింది. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా 380 మంది ఆరోగ్యవంతులైన చిన్న పిల్లలు, పెద్దవాళ్లను రెండు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి ఎక్కువ మోతాదులో, రెండో బృందానికి తక్కువ మోతాదులో టీకా అందజేశారు. అనంతరం ఫలితాలను పరిశీలించగా.. టీకా తీసుకున్న రెండు బృందాల్లోనూ ప్రభావవంతంగా పనిచేసినట్టు కనిపించింది. రెండు డోసుల టీకా ఇచ్చిన తర్వాత ‘దుష్ప్రభావాలు’ నామమాత్రంగా ఉన్నాయి. కొన్నింటిని 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించగా.. తీవ్రమైన సవాళ్లు ఎదురు కాలేదు. ఒకసారి కరోనా వైరస్‌ బారినపడ్డ వారు కూడా, టీకా తీసుకోవడం మేలని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల సూచించారు. కోవిడ్‌కు సంబంధించిన అంశాలపై బుధవారం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ నిర్వహించిన ఆన్‌లైన్‌ చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కరోనా బారినపడ్డవారు కూడా టీకా తీసుకోవాలా.. అని ప్రశ్నించగా, ‘అవును’ అనేదే సమాధానమని డాక్టర్‌ కృష్ణ ఎల్ల చెప్పారు. కొవిడ్‌-19 వచ్చిన వారిలో తగినంత ‘టీ-సెల్‌ రెస్పాన్స్‌’ ఉండకపోవచ్చని, అందువల్ల టీకా తీసుకోవడమే మేలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకా పంపిణీకి వినియోగించనున్న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కోవిన్‌’ బలోపేతానికి టెక్నాలజీ పోటీని ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు, అంకుర సంస్థలు తగిన సొల్యూషన్లు ఇవ్వాలని ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (ఇవిన్‌) వ్యవస్థను అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా శీతల వ్యవస్థల్లో ఉన్న వ్యాక్సిన్‌ నిల్వలు, నిల్వ ఉష్ణోగ్రతల సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం కలుగుతుంది. ఈ పోటీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.


By December 24, 2020 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/antibodies-generated-by-covaxin-may-persist-for-6-12-months-says-bharat-biotech/articleshow/79932867.cms

No comments