Breaking News

మరికొద్ది రోజుల్లో దేశంలో ఆక్స్‌ఫర్డ్ టీకా.. అక్కడ జనవరి 4న?


దేశంలో కరోనాకు తొలి టీకా మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకాకే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ సమర్పించిన అదనపు సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేసిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను డీసీజీఏ అదనపు డేటా సమర్పించాలని కోరిన విషయం తెలిసిందే. అయితే, ఆక్స్‌ఫర్డ్ టీకాపై బ్రిటన్ నిర్ణయం కోసం భారత్ ఎదురుచూస్తోంది. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్‌ జనవరి 4న అందుబాటులోకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ కథనాలపై తాజాగా బ్రిటన్‌ ఆరోగ్యశాఖ స్పందించింది. ‘టీకా ప్రయోగాల‌ సమాచారాన్ని విశ్లేషించేందుకు నియంత్రణ సంస్థ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్స్ట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ)కు కొంత సమయం ఇవ్వాలి. ఎంహెచ్‌ఆర్‌ఏ సలహా మేరకే నిర్ణయం తీసుకుంటాం’‌ అని ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ టీకా జనవరి 4న అందుబాటులోకి వస్తుందని, పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని యూకే మీడియా తెలిపింది. రాబోయే రెండు వారాల్లోనే దాదాపు రెండు మిలియన్ల మందికి ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ సమాచార విశ్లేషణ అనంతరం బ్రిటన్‌ ఎంహెచ్ఆర్ఏ తీసుకునే నిర్ణయం కోసమే భారత్‌ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్రిటన్‌లో వ్యాక్సిన్‌కు అనుమతి అభించిన వెంటనే సీడీఎస్‌సీఓ కూడా వ్యాక్సిన్‌ సమాచార విశ్లేషణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘మేము మా రెగ్యులేటరీ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోవచ్చు... కానీ, యూకే, బ్రెజిల్‌లోని ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాల డేటాను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇక్కడ సమర్పించింది.. దీనిపై సమీక్ష జరుగుతోంది.. సీరం సంస్థ సమర్పించిన తాజా సమాచారం కూడా సంతృప్తికరంగా ఉంది. రెగ్యులేటరీ అసెస్‌మెంట్ ఆధారంగా, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆమోదం పొందుతుందని మేము ఆశిస్తున్నాం’ అని ఓ సీనియర్ అధికార అన్నారు. మరోవైపు, తమ టీకా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ సీఈఓ పాస్కల్ సోరియట్ సండే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఫైజర్-బయోఎన్‌టెక్ (95 శాతం), మోడెర్నా (94.5)లకు సమానంగా ప్రభావం చూపుతోందని అన్నారు. ‘మేము గెలుపు సూత్రాన్ని కనుగొన్నాం.. రెండు డోస్‌ల తరువాత ప్రతిఒక్కరిలోనూ ఉన్న సామర్థ్యాన్ని ఎలా పొందాలో భావిస్తున్నాం’ సోరియట్ అన్నారు.


By December 28, 2020 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/oxford-coronavirus-vaccine-covidshield-may-get-nod-in-a-few-days/articleshow/79984522.cms

No comments