Breaking News

కారు కొనాలకునే డబ్బులతో విద్యార్థులకు 350 ట్యాబ్‌లు, 30వేల మాస్క్‌లు కొన్న టీచర్


ఆయన ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. వచ్చే వేతనంతో భార్య, ఐదుగురు పిల్లలను పోషించడమే కష్టం. అయితే, తనకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన డబ్బుతో ఓ ఖరీదైన కారు కొనుక్కోవాలని భావించాడు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది విద్యార్థులు బడికి దూరమై, పాఠాలు విని పరిస్థితి లేదని తెలిసి ఆ ఆలోచన విరమించుకున్నాడు. విద్యార్థులు చదువుకు దూరమైతే ఆ ఏడాదంతా నష్టపోతారని ఆలోచించి.. కారు కొనాలనుకున్న డబ్బుతో ఇంట్లోనే ఉండి పాఠాలు వినడానికి ఏర్పాట్లు చేశాడు. మొత్తం 343 మంది పిల్లలకు ట్యాబ్‌‌లు, వారి కోసం మరో 30వేల మాస్కులను కొనుగోలు చేశాడు. ఇందుకు దాదాపు 290,000 డాలర్లు (రూ.2.12 కోట్లు) ఖర్చు చేశాడు. ఇరాన్‌లోని ఖుజెస్థాన్‌ ప్రావిన్సుకు చెందిన హుసైన్ అసాదీ (50) అనే ఉపాధ్యాయుడి గొప్పతనం ఇది. అసాదీ చేసిన మంచిపనిని బంధువులు, చుట్టుపక్కలవాళ్లు గెలిచేశారు. వచ్చే జీతంతో ఓ ఇంటినో.. కారునో కొనడం సాధ్యం కాదు.. అలాంటిది ఈ పిచ్చి పనిచేయడం ఏంటని ఎగతాళి చేశారు. వారి విమర్శలకు అసాదీ స్పందిస్తూ.. ‘నేను ఇచ్చిన బహుమతితో తమ చదువు ఇక ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుందని పిల్లల ముఖాల్లో కనిపిస్తున్న అందమైన నవ్వే నాకు చాలు.. అదే నాకు కొండంత సంతృప్తినిస్తోంది’ అని బదులిచ్చాడు. తన ఆదర్శంతో అసాదీ జాతీయ హీరో అయిపోయారు. ఆయన్ను అంతా ప్రశసంలతో ముంచెత్తుతున్నారు. హుసైన్ అసాదీ ఇరాన్ కరెన్సీ 12 బిలియన్ల రియాల్స్ (290,000 డాలర్లు) ఖర్చు చేసి విద్యార్థులకు ట్యాబ్‌లు, మాస్క్‌లు అందజేశాడు. ‘మా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తితో ఓ కారు కొందామనుకున్నా.. పాఠశాలకు రాలేకపోవడం వల్ల ఓ బాలిక కుంగుబాటుకు గురయినట్టు ప్రిన్సిపాల్‌ ద్వారా తెలుసుకుని ఆ బాలికతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’ అని అన్నారు. ఆన్‌లైన్ పాఠాలు వినడానికి తనవద్ద మొబైల్ ఫోన్ లేదని బాలికతో మాట్లాడిన తర్వాత తెలుసుకుని, ఆ చిన్నారికి ట్యాబ్ కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.. ఆర్ధిక పరిస్థితి బాగులేక చదువుకు దూరమైన విద్యార్థులకు వీలైనంత సాయం చేయాలని భావించి తొలుత 153 ట్యాబ్‌లు కొనుగోలు చేశాను.. తర్వాత మరో 200 ట్యాబ్‌లు కొని విద్యార్థులకు అందజేశాను’ అని అసాదీ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచే పాఠశాలలను మూసివేయగా.. ఆన్‌లైన్ విధానంలోనే పాఠాలను బోధిస్తున్నారు. కోవిడ్ తొలినాళ్లలో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఐరోపా దేశాలతోపాటు ఇరాన్‌లో భారీగా కేసులు, మరణాలు చోటుచేసుకున్నాయి.


By December 30, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iranian-teacher-spends-290000-on-educating-deprived-students-for-provide-tabs-and-masks/articleshow/80021884.cms

No comments