Breaking News

1 నుంచి 8 తరగతులకు మార్చి 31 వరకు బంద్.. వారికీ బోర్డ్ పరీక్షలు రద్దు


మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యా సంస్థలను పాక్షికంగా ప్రారంభిస్తున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్కూళ్లు తెరిచే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతులను మార్చి 31 వరకూ ప్రారంభించరాదని నిర్ణయించింది. అలాగే, ఈ ఏడాది ఐదు, ఎనిమిది తరగతి బోర్డు పరీక్షలను కూడా రద్దు చేసింది. తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన విద్యాశాఖాధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ‘1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మార్చి 31 వరకూ పాఠశాలలు ప్రారంభించరాదు.. ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.. ప్రాజెక్టు వర్క్ ఆధారంగా ఒకటి నుంచి ఎనిమిది విద్యార్థులను ప్రమోట్ చేస్తాం.. బోర్డు పరీక్షలున్న పది, ఇంటర్ విద్యార్థులకు తర్వలోనే తరగతులు ప్రారంభిస్తాం.. భౌతికదూరం సహా ఇతర కరోనా నిబంధనలు పాటిస్తూ వారంలో ఒకటి లేదా రెండు రోజులు తొమ్మిది, ఇంటర్ తరగతులు నిర్వహిస్తాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రయివేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని, తరగతులు నిర్వహించకుండా ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన 10వేల పాఠశాలలను ప్రారంభించనున్నట్టు వివరించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు సిద్ధం చేసే బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు సీఎం తెలిపారు. క్లాత్‌లను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద, గెస్ట్ టీచర్స్‌ను వచ్చే ఏడాది కొనసాగుతారు.. ఏటా వారికి గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. నూతన విద్యా విధానంలో భాగంగా 1,500 ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ-1, కేజీ-2 తరగతులను ప్రారంభించనున్నట్టు తెలిపారు.


By December 05, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-classes-for-1-8-standard-students-till-march-31-says-madhya-pradesh-govt/articleshow/79576575.cms

No comments