Breaking News

ఉద్దేశపూర్వకంగానే ఫైజర్ వ్యాక్సిన్ ఫలితాలను దాచిపెట్టారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


తాము అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఫైజర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధమైందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్డీఏ) అధికారులతో కుమ్మక్కయి ఫలితాలను ప్రకటించలేదని ట్రంప్ దుయ్యబట్టారు. కరోనాపై విజయం సాధించే దిశగా వ్యాక్సిన్ వచ్చినట్టు ఎన్నికలకు ముందే ప్రకటించడాన్ని డెమొక్రాట్లు ఇష్టపడలేదని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ట్రంప్.. వ్యాక్సిన్ గురించి ప్రజలకు తాను ఎన్నడో తెలియజేశానని అన్నారు. అధికారిక ప్రకటనను సంస్థ కావాలనే ఆలస్యం చేసిందని ఆరోపించారు. ‘జో బైడెన్ అధ్యక్షుడైతే మరో నాలుగేళ్ల పాటు వ్యాక్సిన్ రాబోదని నేను చెప్పగలను.. టీకాను యూఎస్ ఎఫ్డీయే కూడా త్వరగా అనుమతించదు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను వారి వైఖరి ప్రమాదంలోకి నెట్టనుంది’అన్నారు. ‘నేను చాలాకాలంగా భావిస్తున్నట్టుగానే, ఫైజర్, ఇతర సంస్థలు ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని భావించలేదు.. ముందే ఈ పని చేసే ధైర్యం వారికి లేకపోయింది. యూఎస్ ఎఫ్డీయే సైతం రాజకీయ ప్రయోజనాలనే చూసింది’ అని అన్నారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని, మరిన్ని నెలల పాటు ప్రజలు వైరస్ ను ఎదుర్కొనేలా తమవంతు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించిన ట్రంప్.. వ్యాక్సిన్ తయారీ వెనకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఫైజర్ నుంచి వచ్చిన ప్రకటన జాతికి కొత్త ఊపిరిని ఇచ్చిందని అన్నారు. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం ఫైజర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు.


By November 10, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-elections-donald-trump-alleges-pfizer-vaccine-announcement-withheld-before-elections/articleshow/79143533.cms

No comments