భారత్ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా .. చైనా కీలక నిర్ణయం
దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలతో వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొద్ది నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, దిగుమతి చేసుకున్న అహార పదార్థాల్లో కరోనా వైరస్‌ను చైనా గుర్తించడం కలకలం రేగుతోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లోనే కరోనా ఆనవాళ్లు గుర్తించడం గమనార్హం. బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కటిల్‌ఫిష్ ఫ్రోజెన్ ప్యాకేట్ల మూడు నమూనాల్లో వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని ఆ కథనం పేర్కొంది. దీంతో వారం పాటు దిగుమతులు నిలిపివేసినట్టు తెలిపింది. ఇటీవల ఇండోనేషియాకు చెందిన పీటీ అనురాగ్ లౌట్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లోనూ చైనా కస్టమ్స్ అధికారులు వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ కంపెనీ దిగుమతులను కూడా వారం పాటు నిలిపివేశారు. గత నెల బ్రెజిల్, ఈక్వెడార్, రష్యా దేశాల నుంచి చైనాకు వచ్చిన ఆహార పదార్థాల్లోనూ వైరస్ జాడ ఉన్నట్లు తేలింది. కరోనా నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను చైనా పరీక్షీస్తోంది. అలా గత నెల ఈక్వెడార్ నుంచి దిగుమతైన రొయ్యలు, బ్రెజిల్ నుంచి వచ్చిన చికెన్ వింగ్స్ ఉత్పత్తులను పరీక్షించగా.. వ్యాధికారక వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో అప్పట్లో కూడా దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆహారం లేదా ఆహార ప్యాకేజీలతో కరోనా వ్యాపించదని.. ఇప్పటివరకు ఇలా వైరస్ సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఆహారం, ఫుడ్ ప్యాకేజింగ్, ఆహార పదార్ధాలు కొనుగోలు చేసే విషయంలో భయం అక్కర్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా ఇచ్చింది. చైనాలో జరిగిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. కొన్ని లక్షల ఆహార పదార్ధాలు, ప్యాకేజింగ్‌లపై కరోనా పరీక్ష నిర్వహించగా.. అతి తక్కువ ప్యాకేజింగ్‌లపైనే కరోనాను గుర్తించినట్లు చెప్పింది.
By November 13, 2020 at 12:48PM
No comments