Breaking News

షరతులతో కూడిన చర్చలకు నో చెప్పిన రైతులు.. ఢిల్లీని దిగ్భంధిస్తామని హెచ్చరిక


కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కదం తొక్కిన అన్నదాతలు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా పోరాటం సాగిస్తున్నారు. మొత్తం 30 రైతు సంఘాలు ఒకే గొడుగు కిందికొచ్చి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. తమ పోరాటం దీర్ఘకాలం కొనసాగించడానికి సిద్ధపడిన కర్షకులు.. కంబళ్లు, వంటపాత్రలు, సామాగ్రితోనే రావడం విశేషం. ఇదిలా ఉండగా పరిస్థితి విషమించడంతో కేంద్రం చర్చలకు ముందడుగు వేసింది. డిసెంబరు 3న చర్చలకు ఆహ్వానించింది. అయితే, చర్చలకు ముందు ప్రస్తుతం బైఠాయించిన సింఘూ, టిక్రీ పాయింట్ల నుంచి వైదొలిగి బురారి గ్రౌండ్స్‌కు తరలాలని హోంమంత్రి అమిత్‌ షా షరతు విధించారు. దీనికి రైతులు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. బురారి మైదానం ఓ బహిరంగ జైలు లాంటిదని, అక్కడికి మారేది లేదని స్పష్టం చేశారు. బేషరతుగా చర్చలు జరపడానికి తాము సిద్ధమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) హరియాణా విభాగం అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌ ప్రకటించారు. ‘తీసుకొచ్చిన చట్టాలపై మాకు నచ్చచెప్పడానికే చర్చలు జరపాలని కేంద్రం భావిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు.. షరతులు లేకుండా మా వాదనలు విని రైతుల కోసం మారడానికి సిద్ధపడితేనే చర్చలు జరపాలి. అప్పుడే మేమూ వాటికి సిద్ధం’ అని రైతుసంఘాల సంయుక్త వేదిక ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎ్‌ససీసీ) ప్రతినిధి పేర్కొన్నారు. కొత్త చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని, ఎంఎస్పీ వ్యవస్థను నిరవధికంగా కొనసాగించేట్లు కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. అటు, విద్యుత్తు సవరణ చట్టం-2020ను కూడా రద్దుచేయాలని, తమ డిమాండ్లను అంగీకరిస్తామని ప్రకటించేవరకూ ఢిల్లీ పొలిమేరలు వదిలివెళ్లే ప్రసక్తేలేదని, రాజధానికి దారితీసే అయిదు ప్రవేశ మార్గాల్ని దిగ్బంధనం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. రైతుల ఆందోళన రాజకీయ ప్రేరేపితమని బీజేపీ గానీ, కేంద్రంగానీ భావించడం లేదని, తామెన్నడూ అలా అనలేదని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలపై షా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో గానీ, ఇపుడు గానీ రైతుల వెనుక రాజకీయ హస్తం ఉందన్నది తమ అభిప్రాయం కాదని వివరించారు. అయితే, కొత్త వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ మరోసారి సమర్థించుకోవడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా రైతులు తమ సమస్యలను డిమాండ్ల రూపేణా ఏకరువు పెడుతూనే ఉన్నారని, మేం వాటిని నెరవేర్చాం. ఈ సంస్కరణలు రైతుల బంధనాల్ని తెంచేశాయి’’ అని ఆయన మన్‌కీ బాత్‌లో అన్నారు.


By November 30, 2020 at 07:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmers-protest-farmers-unions-reject-governments-conditional-talk-offer/articleshow/79483373.cms

No comments