సాధారణ ఫ్లూ టీకా ధరకే మోడెర్నా వ్యాక్సిన్.. ఒక్కో డోస్ ఎంతంటే?


తాము అభివృద్ధి చేసిన టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను విశ్లేషించి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాము తయారుచేసిన టీకా ఒక్కో డోసుకు 25 నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ ఫ్లూ టీకాకు వసూలు చేస్తున్న 10 నుంచి 50 డాలర్ల పరిధిలోనే కరోనా వ్యాక్సిన్ ధర కూడా ఉండే అవకాశం ఉందని మోడెర్నా సీఈవో స్టెఫానీ బాన్సెల్ జర్మనీ వార పత్రిక వెల్ట్ ఎం సొంటాగ్‌కు తెలిపారు. మోడెర్నా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. జులై నుంచే ఐరోపా సమాఖ్య చర్చలు జరుపుతున్నా.. గత సోమవారం మరో దఫా ప్రత్యేకంగా చర్చలు జరిపింది. ఒక్కో డోస్ 25 డాలర్ల కంటే తక్కువకు ఇస్తే మిలియన్ల డోసులు కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఐరోపా సమాఖ్య స్పష్టం చేసినట్టు బాన్సెల్ తెలిపారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈయూ కమిషన్ సిద్ధంగా ఉన్నా.. తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ఐరోపా ప్రజలకు టీకా అందించడంపై సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. mRNA-1273 వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ముందస్తు ఫలితాల విశ్లేషణలో వెల్లడైందని ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా సమర్థతను తమ వ్యాక్సిన్ చేరుకుందని మోడెర్నా వ్యాఖ్యానించింది. తొలి మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5 శాతం సమర్థతతో వ్యాక్సిన్ పనితీరు కనబరిచినట్లు వెల్లడించింది. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నియమించిన డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు (డీఎస్ఎంబీ) నిపుణుల బృందం ఇప్పటివరకు మోడెర్నా నిర్వహించిన మూడోదశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించి ఈవిషయాన్ని వెల్లడించింది. మొత్తం 30వేల మంది వాలంటీర్లపై మోడెర్నా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వీరిలో 15వేల మందికి ప్లాసీబో (డమ్మీ) చికిత్స.. మరో 15వేల మందికి వ్యాక్సిన్ ( ఎంఆర్‌ఎన్‌ఏ-1273) అందజేశారు. ప్లాసీబో ఇచ్చిన 90 మందిలో కరోనా లక్షణాలు బయటపడగా, వారిలో 11 మందిలో తీవ్ర ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. వ్యాక్సిన్ గ్రూపులోని వాలంటీర్లలో ఐదుగురిలోనే కరోనా లక్షణాలు బయటపడినా వైరస్ తీవ్రత జాడ కనిపించలేదు. వ్యాక్సిన్ తయారీలో ఫైజర్, మోడెర్నా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడ్డాయి.. ‘మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ’ అని పిలిచే అణువుల సింథటిక్ వెర్షన్‌లను మానవ కణాలలోకి చొప్పించి, వాటిని టీకా తయారీకి ఫ్యాక్టరీగా మారుస్తారు. ‘మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై వచ్చిన ఈ సానుకూల మధ్యంతర విశ్లేషణ.. మా టీకా కోవిడ్-19 తీవ్రంగా ఉన్నా నివారించగలదని మొదటి క్లినికల్ ట్రయల్స్‌కు ధ్రువీకరణ ఇచ్చింది’అని మోడెర్నా సీఈఓ స్టెఫానే బాన్సెల్ అన్నారు.
By November 22, 2020 at 01:21PM
No comments