Breaking News

తేజస్వీ మంచి అబ్బాయి.. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నడుపుతాడు: బీజేపీ నేత, మాజీ సీఎం కితాబు


బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీయే విజయం సాధించినా.. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తన పోరాట పటిమతో అందరి మనసులను గెలుచుకున్నారు. తలపండిన రాజకీయ నేతలతో ఒంటరి పోరాటం చేసి, ప్రతిపక్ష కూటమి ప్రచారాన్ని మొత్తాన్ని తన భుజస్కంధాలపైనే మోశారు. అధికారంలోకి రాకపోయినా అధికార కూటమికి ముచ్చెమటలు పట్టించి, వారిని తక్కువ స్థానాలకే పరిమితం చేశారు. అంతేకాదు, బిహార్‌కు భవిష్యత్తులో సీఎం అయ్యే అన్ని అర్హతలు తనకున్నాయని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా, ఈ యువనేతను బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి అభినందించారు. బుధవారం ఆమె భోపాల్‌లో మాట్లాడుతూ... తేజస్వీ వయసులో చాలా చిన్నవాడు కావడంతో అనుభవం లేదు.. ఒకవేళ విజయం సాధించినా పాలన లాలూ చేతుల్లోకి వెళ్లిపోయేదని ఉమా భారతి వ్యాఖ్యానించారు. ‘తేజస్వీ చాలా మంచి అబ్బాయి.. కానీ బిహార్ వారి చేతుల్లోకి వెళ్లకపోవడం బతికిపోయింది.. ఎందుకంటే వయసులో చిన్నవాడు కావడంతో రాష్ట్రాన్ని నడపలేడు.. (ఆర్జేడీ అధినేత) లాలూ అధికారం చెలాయించి బిహార్‌ను ఆటవిక రాజ్యంలోకి నేట్టేసేవారు. తేజస్వీకి అనుభవం వచ్చాక ప్రభుత్వాన్ని నడపగలడు’ అని అన్నారు. అలాగే కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌పై ప్రశసంలు కురిపించారు. ఉప-ఎన్నికల్లో కమల్ చాలా గట్టిగానే పోరాటం సాగించారని కితాబిచ్చారు. బహుశా ఆయన ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపి ఉంటే సమస్యలు ఎదురయ్యేవి కావు.. ఆయన చాలా మంచి వ్యక్తి నాకు అన్న లాంటివారు.. ఉప-ఎన్నికల్లో వ్యూహాత్మకంగానే పోరాటం చేశారని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ఉప-ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లలో విజయం సాధించి, అధికారం నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కేవలం 9 చోట్ల మాత్రమే విజయం సాధించింది. మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు 22 మంది తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే.


By November 12, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-senior-leader-uma-bharai-praises-rjd-leader-tejashwi-yadav-for-fight-in-bihar-elections/articleshow/79183743.cms

No comments