యూఏఈలో హిందూ ఆలయం.. డిజైన్ వీడియోను విడుదల చేసిన నిర్వాహకులు
యూఏఈలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయ నమూనాను ఆలయ నిర్వాహకులు విడుదల చేశారు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు, పురాతన గాధలతో ఆలయ గోడలు అలరారనున్నాయని నిర్వాహకులు తెలిపారు. అబుదాబిలో నిర్మించనున్న ఈ భారీ ఆలయానికి గతేడాది ఏప్రిల్‌లో భూమిపూజ నిర్వహించగా.. డిసెంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం నిర్మిస్తున్న ‘ఆధ్యాత్మిక ఒయాసిస్సు’గా దీనిని నిర్వాహకులు అభివర్ణించారు. వీడియోను విడుదల చేసిన బీఏపీఎస్.. ఇందులో లైబ్రరీ, ఓ క్లాస్ రూమ్, కమ్యూనిటీ హల్, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మెట్లపై జలపాతం మాదిరిగా నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది. ఆలయ మాస్టర్ ప్లాన్ 2020 తొలినాళ్లలోనే పూర్తయినా కరోనా వైరస్ కారణంగా కొద్దిగా ఆలస్యమైనట్టు బీఏపీఎస్ హిందూ ఆలయ అధికార ప్రతినిధి అశోక్ కొటేచా తెలిపారు. తుది నమూనాను వీడియో ద్వారా విడుదల చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ‘చరిత్రాత్మక ఈ ఆలయ నిర్మాణం భారత్, యూఏఈ ప్రభుత్వ సహకారం, మార్గదర్శకంలో జరుగుతోంది.. కరోనా వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి స్థానిక విధానాలకు కట్టుబడి ఉన్నాం.. భారత్‌లో శిల్పాల పనులు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. సార్వత్రిక జ్ఞానం ముఖ్య విలువలు, కథలు, ప్రామాణికమైన పురాతన కళ, వాస్తుశిల్పాలను ఆలయ ప్రాకారంలో పొందుపరచనున్నామని తెలిపారు. ‘రాతి స్తంభాలపై భారత భౌగోళిక స్వరూపం, హిందూ ధర్మంపై కథలను పొందుపరచనున్నాం... ఇందులో మహాభారతం, రామాయణంతో పాటు పురాణాలు, ప్రాంతీయ చరిత్రలు ఉంటాయి. వాస్తవానికి, ఈ మందిరం క్లిష్టమైన మాండోవర్ ముఖభాగం ప్రత్యేక గుర్తింపు పొందనుంది.. ఇది భారత్‌లోని అనేక సాంప్రదాయ కథలు, గల్ఫ్ నుంచి ప్రత్యేకమైన డిజైన్లతో రూపుదిద్దుకోనుంది’ అని కొటేచా వ్యాఖ్యానించారు. రాజస్థాన్, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 25వేల చదరపు అడుగుల శిలలను సేకరించినట్టు తెలిపారు. ఇటలీ నుంచి మార్బుల్, రాజస్థాన్ నుంచి రాతిఇసుకను తెప్పిస్తున్నట్టు వివరించారు.
By November 11, 2020 at 07:02AM
No comments