Breaking News

మరోసారి సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్


బ్రిటన్ ప్రదాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల బోరిస్‌ను కలిసిన ఓ ఎంపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నారు. ప్రస్తుతానికి బోరిస్‌కు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ఏప్రిల్‌లో ఓసారి కరోనా బారినపడ్డ .. మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు. తొలుత హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ దాదాపు మూడురోజులు పాటు ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగింది. చికిత్స అనంతరం కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు. కరోనా సమయంలో తాను విషమ పరిస్థితిని ఎదుర్కొన్నానని, వైద్యులు కూడా ఆశలు వదులుకున్నట్టు బోరిస్ తన అనుభవాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తాను దురదృష్టవశాత్తూ చనిపోతే ఆ వార్తను బయటి ప్రపంచానికి ఎలా తెలియజేయాలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారని ‘ది సన్’పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్సన్ సంచలన విషయం వెల్లడించారు. తాజాగా మళ్లీ బోరిస్ క్యారంటైన్‌కు వెళ్లడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌’ నిబంధనల ప్రకారం పదిరోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అంటే నవంబరు 26 వరకు బోరిస్‌ క్వారంటైన్‌లో ఉంటారు. గురువారం ఉదయం పలువురు ఎంపీలతో బోరిస్‌ 35 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీకి హాజరైన యాష్‌ఫీల్డ్‌ ఎంపీ లీ ఆండర్సన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం నుంచి ఆయనకు కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్-19 పరీక్షల్లో వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లారు. అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు బోరిస్‌కు సమాచారం అందించి ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాయి. బ్రిటన్‌లో రెండోసారి మహమ్మారి విజృంభించడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. డిసెంబరు 1 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. మరోవైపు, క్రిస్టమస్ నుంచి వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ సిద్ధమవుతోంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌‌కా టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ప్రయోగాల్లో నిరూపణ కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.


By November 16, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-prime-minister-boris-johnson-who-had-tested-covid-self-isolates-again/articleshow/79243318.cms

No comments