Breaking News

బిహార్ సీఎంగా కొత్త వ్యక్తి.. కేంద్ర క్యాబినెట్‌లోకి నితీశ్?


అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన బీహార్ ఎన్నికల ఫలితాల్లో చివరికి విజయం ఎన్డీఏ కూటమినే వరించింది. మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 122 కాగా... కూటమి 125 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, ఎన్డీఏలో బీజేపీ 74 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం పార్టీ జేడీయూ 43 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి నితీశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్ స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి, బీజేపీ నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, నితీశ్ స్థానంలో అంతటి సమర్ధత కలిగిన నేత బీజేపీలో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్‌ను సీఎంగా అంగీకరించడం తప్పా బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ, బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తే నితీశ్ దానికి అంగీకరించే అవకాశం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీశ్‌ను సీఎంగా బీజేపీ ఒప్పుకోకపోతే కొంత ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు. అయితే, నితీశ్‌ను దెబ్బతీయడానికే వ్యూహాత్మకంగా చిరాగ్‌ పాశ్వాన్‌ను ఎన్‌డీఏ నుంచి బయటకు పంపారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే బీజేపీ పోటీచేసిన చోట్ల ఎల్జేపీ అభ్యర్థులను నిలబెట్టలేదని అంటున్నారు. జేడీయూ అభ్యర్థులు చాలా స్థానాల్లో ఓటమికి ఎల్జేపీ కారణమయ్యింది. వారి విజయావకాశాలను చిరాగ్ దెబ్బతీయడంతో కూటమిలో రెండో స్థానంతో జేడీయూ సరిపెట్టుకుంది. అయితే, నితీశ్‌ను కట్టడి చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నం సఫలమై.. వారి లక్ష్యం నెరవేరిందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. బీజేపీ ఎటువంటి ఆటంకాలు కల్పించకపోతే ఇప్పటికే ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నితీష్ ఇప్పుడు ఏడోసారీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ బీహార్‌కు 37వ ముఖ్యమంత్రి కానున్నారు.


By November 11, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-election-2020-rumours-on-nitish-kumar-may-not-sworn-as-bihar-cm-due-to-less-seats-in-nda/articleshow/79163937.cms

No comments