అతడికి భూమ్మీద నూకలున్నాయి.. వేటాడి వదిలేసిన పులి.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో
పులి పంజా విసిరితే బతికి బట్టకట్టడం అసాధ్యమని అంటారు. ‘పులి గోకడం.. అయ్య బతకడం’ అనే నానుడి కూడా ఉంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు పులి పంజా నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ఈ భూమ్మీద నూకలు ఉండటంతో బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన అసోంలోని తేజ్‌పూర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం చోటుచేసుకుంది. సమీపంలోని అడవుల నుంచి పొలాల్లోకి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. వారిపై దాడికి ప్రయత్నించడంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు. వారిలో ఓ యువకుడిని వెంటబడి తరమడమే కాదు పంజా విసిరింది. పులి నుంచి తప్పించుకోడానికి ఆ వ్యక్తి పరుగులు తీసి ఓ గోతిలో దూకేశాడు. పులి కూడా అమాంతం అతనితో పాటే గోతిలోకి దూకింది. కానీ, ఎందుకనో వెంటనే వెనక్కి వచ్చేసి ఇసుక తెన్నెలు మీదుగా సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయి మాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీశాఖ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు పెట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమీపంలోని లేదా నమేరి నేషనల్ పార్క్ నుంచి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ‘ఒకవేళ పెద్ద పులి కజిరంగా పార్క్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలియదు.. సాధారణంగా, నమేరిలోని పులులు కదలిక కోసం జియా భరాలి నది వెంట ఒక పాచ్ ఉపయోగిస్తాయి’ అని కజిరంగా జాతీయ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ పి శివకుమార్ అన్నారు.
By November 25, 2020 at 12:00PM
No comments