Breaking News

కరోనాతో మృతిచెందిన తమిళనాడు వ్యవసాయ మంత్రి దొరైక్కన్ను


కరోనా వైరస్ మహమ్మారికి మరో ప్రజాప్రతినిధి బలయ్యారు. తాజాగా, కరోనా వైరస్ బారినపడ్డ తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను(72) శనివారం రాత్రి కన్నుమూశారు. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.మంత్రి దొరైక్కన్నుకు అక్టోబరు 13న కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో వైద్యం కోసం విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. శనివారం నుంచి పరిస్థితి విషమించింది. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లో 90 శాతం మేర ఇన్‌ఫెక్షన్ చేరినట్టు సీటీ స్కాన్‌లో వెల్లడయ్యింది. దీంతో ఆయనకు ఈసీఎంఓపై చికిత్స కొనసాగించారు. ఆయనను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో శనివారం రాత్రి 11.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక, 1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్నులో జన్మించారు. మూడుసార్లు పాపనాశం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంత్రి దొరైక్కన్ను మృతిపై ముఖ్యమంత్రి పళనిసామి, తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘నిరాంబడరత, వినయం, ముక్కుసూటితనం, పాలనా నైపుణ్యాలు, రైతుల సంక్షేమం పట్ల నిబద్ధత ఆయన సొంతం.. వ్యవసాయ మంత్రిత్వ శాఖను పూర్తి అంకితభావంతో నిర్వహించి బలమైన ముద్ర వేశారు. ఆయన అకాల మరణం తమిళనాడు ప్రజలకు, అన్నాడీఎంకే పార్టీకి కోలుకోలేని నష్టం’ అని గవర్నర్ పేర్కొన్నారు.


By November 01, 2020 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-agriculture-minister-doraikkannu-dies-due-to-coronavirus/articleshow/78977495.cms

No comments