Breaking News

హథ్రాస్ ఘటన.. నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య కేసు నమోదుచేసిన సీబీఐ


హథ్రాస్ కేసులో విచారణ చేపట్టాలని ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం చేపట్టింది. నిందితులపై వివిధ సెక్షన్‌ల కింద సామూహిక అత్యాచారం, హత్యాయత్నం, హత్య కేసులను నమోదుచేసింది. కేసు నమోదుచేసిన కొద్ది గంటల్లోనే హథ్రాస్‌కు చేరుకున్న బృందం.. ఎస్పీని కలిసింది. ఈ విషయాన్ని ఎస్పీ వినీత్ జైన్ ధ్రువీకరించారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటి వరకూ సేకరించి ఆధారాలు, కేసు వివరాలను సీబీఐ బృందం కోరిందన్నారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను అందజేశామని, సోమవారం నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభం కానుందని తెలిపారు. రాబోయే వారాల్లో 15 మంది వరకు సీబీఐ అధికారులు హథ్రాస్‌కు వస్తారని భావిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే, బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారా? అనే అంశంపై కూడా విచారణ చేయనుంది. అత్యాచారం కేసు నమోదుచేయకుండా అలసత్వం వహించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంత్యక్రియల విషయంలో పోలీసుల పాత్రపై యూపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతుందని, ప్రధాన కేసుతో దీనికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అటు, ఘజియాబాద్ విభాగానికి ఈ కేసు అప్పగించామని, ప్రత్యేక బృందం దర్యాప్తు చేయనుందని సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటన తర్వాత చందపా పోలీస్ స్టేషన్‌లో ప్రధాన నిందితుడు సందీప్‌పై నమోదయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ కేసు నమోదుచేసింది. ‘ఊరిబయట పొలాల్లో తన సోదరిపై అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ సెప్టెంబరు 14న హతురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు.. దీనిపై సీబీఐ ఆదివారం కేసు నమోదుచేశాం .. ఓ బృందాన్ని ఏర్పాటుచేశాం.. దర్యాప్తు కొనసాగుతోంది’ అని సీబీఐ అధికారి సీమా పహుజా అన్నారు.


By October 12, 2020 at 06:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cbi-files-gang-rape-murder-case-against-accused-in-hathras-case/articleshow/78611404.cms

No comments