Breaking News

అధ్యక్ష ఎన్నికల డిబేట్: ట్రంప్‌పై విరుచుకుపడ్డ జో బిడెన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థుల మధ్య చివరి డిబేట్ గురువారం సాయంత్రం జరిగింది. ట్రంప్ కరోనా వైరస్ బారిన పడటంతో రెండో డిబెట్ రద్దయిన విషయం తెలిసిందే. టెన్నెసీలోని నాష్‌‌విల్లే‌లో , మధ్య జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ట్రంప్ వద్ద ఓ ప్రణాళిక లేదని ధ్వజమెత్తారు. కోవిడ్-19 మరణాలకు కారణమైనవారు ఎవరూ అధ్యక్షుడిగా ఉండటానికి అర్హతలేదని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బిడెన్ సూచించారు. కరోనా వైరస్ ప్రమాదకరమనే విషయాన్ని ప్రజలకు ఎప్పుడూ చెప్పలేదని, ఆందోళన వద్దని చెబుతూ వచ్చారని మండిపడ్డారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ మరి కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని తెలిపారు. మేము దేశాన్ని మూసివేయలేమని, జో బిడెన్ మాదిరిగా నేలమాళిగలో ఉండలేమని ట్రంప్ ఎదురుదాడి చేశారు. ప్రజలు కరోనా వైరస్‌తో జీవించడం నేర్చుకున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ విషయంలో తాను చేపట్టిన చర్యలకు పలు దేశాధినేతలు అభినందించారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బిడెన్ జోక్యం చేసుకుంటూ.. ట్రంప్ ప్రతిస్పందన అత్యంత విషాదకరమని ఓ ప్రముఖ జర్నల్ ప్రచురించిందని తిప్పికొట్టారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవడం అంటే ప్రాణాల కోల్పోడమా అని నిలదీశారు. కరోనాతో బలంగా పోరాడుతున్నాం.. మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం.. నేను వైరస్ బారినపడి చాలా నేర్చుకున్నాను…మనం కోలుకోవాలని అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బిడెన్ హెచ్చరించింది. అమెరికా సౌర్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 22 సంవత్సరాలుగా చెల్లించిన పన్నుల వివరాలను వెల్లడించానని, నా జీవితంలో విదేశాల నుంచి ఒక్క పైసా కూడా అందుకోలేదని బిడెన్ స్పష్టం చేశారు.


By October 23, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-presidential-debate-covid-vaccine-to-be-announced-within-weeks-says-donald-trump/articleshow/78820319.cms

No comments