Breaking News

వ్యాక్సిన్ వచ్చినా మళ్లీ మళ్లీ పునరావృతం.. ఎండెమిక్‌గా కరోనా?


తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు తుది అంకానికి చేరుకున్నాయి. అయితే, సమర్ధవంతమైన టీకా వచ్చినా భవిష్యత్తులో సాధారణ ఫ్లూ మాదిరిగా వ్యాపించే అవకాశాలున్నాయని, ఎండెమిక్‌‌గా మారతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమై మళ్లీ మళ్లీ పునరావృతమౌతుందా? అనే ప్రశ్నలకు.. అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. మిజిల్స్‌‌ వంటి వ్యాధులకు వ్యాక్సిన్‌లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా నిర్మూలించలేకపోయామని మే నెలలో వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలన్నీ తాత్కాలికమేనని అర్థమవుతోంది. అంతేకాదు, మహమ్మారి సోకిన తర్వాత శరీరంలో ఎంతకాలం ఉంటుంది? యాంటీబాడీలు ఎంత కాలం ఉంటాయి? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో మానవులలో మళ్లీ మళ్లీ సోకే లక్షణాలున్న సాధారణ వైరస్‌గానే కోవిడ్ మారే అవకాశం ఉందని కొలంబియా వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రీ-ఇన్‌ఫెక్షన్‌, వ్యాక్సిన్‌ లభ్యత, సమర్థత, సీజనాలిటీ వంటి అంశాలు దీనికి కారణాలుగా పేర్కొంటున్నారు. వీటితోపాటు కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రభావితం చేయగల మిగతా వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల చర్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వైరస్‌ సోకడం ద్వారా లేదా టీకా వల్ల లభించిన రోగనిరోధక శక్తి ఓ సంవత్సరంలోపే తగ్గిపోతుందనే కోణంలో పరిశోధన సాగించారు. ఇది స్థానిక వైరస్‌ల వల్ల కలిగే స్వల్ప అనారోగ్య సమస్యతో సమానం. వీరి అంచనా నిజమైతే ఏడాది తర్వాత కూడా వైరస్‌ విజృంభణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఇతర స్థానిక కరోనా వైరస్‌ (ఎండెమిక్‌)ల సంక్రమణతో లభించే రోగనిరోధక శక్తి చాలాకాలం ఉండే అంశాన్ని కూడా విశ్లేషించారు. ఇది సాధ్యమైతే, ఇలా కొన్నేళ్లు వైరస్‌ వ్యాప్తి పునరావృతమైన తర్వాత పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని పేర్కొన్నారు. అయితే, వీటికి వ్యాక్సిన్‌ లభ్యత, దాని ప్రభావంతోపాటు ఇతర కాలానుగుణ అంశాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇందు కోసం ముందుగా రీ-ఇన్‌ఫెక్షన్‌లు సాధారణమనే అంశాన్ని రుజువుచేయాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని ఎక్కువ జనాభాకు అందించడం ద్వారా వైరస్‌ను ఒకే ప్రాంతానికి పరిమితమయ్యే ‘ఎండెమిక్’‌గా స్థిరపడుతుంది. అయితే, ఈ రీ-ఇన్‌ఫెక్షన్‌లు సాధారణమైనవేనా? అవి ఎంత తరచుగా జరుగుతాయి? తిరిగి వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి ఎంతమందికి సోకుతుంది? వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయి? అనే అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయడ్డారు. ఇక, కరోనా వైరస్‌ నుంచి రోగనిరోధక శక్తి పొందిన తర్వాత ఆ వ్యక్తి మరో వైరస్‌ బారినపడటం కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. ఒకవైరస్‌ సోకడానికి ముందు లేదా తర్వాత మరోవైరస్‌ బారినపడ్డ వారిలో ముందు ఇన్‌ఫెక్షన్‌ నుంచి లభించిన రోగనిరోధకత కేవలం స్వల్పకాలమే (వారం పాటు) రక్షణ కల్పిస్తుందనే విషయాన్ని పలు అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏకకాలంలో సంక్రమించిన వైరస్‌ల ప్రభావం, వ్యాధి తీవ్రతను పెంచడంలో సంబంధం కలిగి ఉండవని పరిశోధనలు నిర్ధారించాయి. వాక్సిన్ వచ్చినా కరోనా మహమ్మారి ఎండెమిక్‌గా మారుతుందని అమెరికా ఫార్మా సంస్థ ఎలి లిల్లీ సీఈఓ డేవిడ్ రిక్స్ వ్యాఖ్యానించారు. ‘ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోరు.. కాబట్టి ఈ వ్యాధి స్థానికంగా మారి వ్యాప్తి చెందుతుంది. మోనోక్లోనల్ వంటి యాంటీబాడీ ఔషధాలు ఈ అనారోగ్యం ముప్పును నివారించడంలో సహాయపడతాయి’ అని అన్నారు. సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ను తొందరగా అందుబాటులోకి తెచ్చినా అది 50-60 శాతం కంటే ఎక్కువ మందిని రక్షించలేవని అభిప్రాయపడ్డారు. ఎలి లిల్లీ సైతం యాంటీబాడీ చికిత్సా విధానంపై పనిచేస్తుంది. అయితే, క్లినికల్ ట్రయల్స్‌లో ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు.


By October 17, 2020 at 07:06AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-may-become-endemic-spread-even-after-vaccines-are-available/articleshow/78712899.cms

No comments