Breaking News

మళ్లీ కోవిడ్ విజృంభణ: ఇటలీలో జిమ్స్, థియేటర్లు మూసివేత.. స్పెయిన్‌లో కర్ఫ్యూ


మరోసారి ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు ఆంక్షలు విధించే దిశగా కదులుతున్నాయి. తాజాగా, ఇటలీలో నవంబరు 24 వరకు ఆంక్షలు విధిస్తూ ఆ దేశ ప్రధాన మంత్రి గియుసేప్ కొంటే ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి నవంబరు 24 వరకు జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించారు. అంతేకాదు, ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ గియుసేప్ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ మహమ్మారి నియంత్రణకు 10వారాల లాక్ డౌన్ విధించారు. ప్రజల ఆరోగ్యంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని కొంటే పునరుద్ఘాటించారు. తాజా నిషేధం సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. గడిచిన రెండు రోజుల్లో 20వేల మందికి కొత్తగా వైరస్ నిర్దారణ అయ్యింది. బ్రిటన్ తర్వాత ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. బార్ అండ్ రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటలకు మూసివేయడం సహా అమెరికా, ఇతర దేశాల నుంచి పర్యాటకుల రాకను నిషేధించింది. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలు, రిసెప్షన్లు, మత లేదా పౌర వేడుకలను నిషేధించారు. జిమ్‌కు వెళ్లకుండా ఆరుబయట వ్యాయామం చేయవచ్చని ఇటలీ సర్కారు సూచించింది. కాగా, కంపానియాలో కర్ఫ్యూ విధించడాన్ని నిరసిస్తూ వందలాది మంది ముఖ్యమంగా యువత పోలీసులతో గొడవకు దిగారు. మరోవైపు, స్పెయిన్ కూడా ఎమర్జెన్సీ విధించింది. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్టు తెలిపింది. కరోనా కేసులు ఒక్క మిలియన్ దాటిన తొలి పశ్చిమ ఐరోపా దేశంగా స్పెయిన్ నిలిచింది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్‌లు కరోనా వైరస్ కోలుకోలేని దెబ్బకొట్టింది. మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉందని, ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధ్నోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఐరోపాలో ఇటువంటి పరిస్థితి ఉంది. ఐరోపాలో 8.2 మిలియన్ల మంది కరోనా బారినపడగా.. దాదాపు 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.


By October 26, 2020 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-in-europe-italy-closes-gyms-cinemas-and-pools-while-spain-introduces-curfew/articleshow/78865680.cms

No comments