Breaking News

బిహార్ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్సే కాదు, జ్యోతిషం, చిలక జోస్యాలపై కూడా నిషేధం!


బిహార్ శాసనసభ ఎన్నికలు మూడు విడతల్లో జరగనుండగా తొలి దశ పోలింగ్ అక్టోబరు 28న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు అంచనాలు, ఎగ్జిట్ పోల్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జ్యోతిషులు, చిలక జోస్యం చెప్పడం కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. జాతకాలు చెప్పేవారు, టారోట్‌ రీడర్లు (బొమ్మలతో కూడిన కార్డులతో జోస్యం చెప్పేవారు), రాజకీయ విశ్లేషకులు, ఇంకెవరైనా ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ముందస్తు అంచనాలను మీడియాలో వెల్లడించరాదని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబరు 28, నవంబరు 03, నవంబరు 07న పోలింగ్ జరగనుండగా.. నవంబరు 10 ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధంలో భాగంగా ఈమేరకు ఎడ్వైజరీని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రానిక్‌, ప్రింట్ మాధ్యమాలేవీ ఇలాంటివాటిని ఏవిధంగానూ ప్రసారం చేయడం, ప్రచురించడం చేయరాదని పేర్కొంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సాఫీగా జరిగేందుకు ఈ నిషేధం అక్టోబరు 28 ఉదయం 7 గంటల నుంచి నవంబరు 7 సాయంత్రం 6.30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 126ఏ కింద ఇటువంటి సూచనలను తొలిసారిగా 2017 మార్చి 30న ఈసీ వెలువరించింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల సమయంలో ఈ మార్గదర్శకాలను అమలు చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. ‘జ్యోతిషులు, టారోట్ రీడర్స్, రాజకీయ విశ్లేషకులు లేదా నిషేధిత కాలంలో ఏదైనా వ్యక్తులు ఎన్నికల ఫలితాలను ఏ రూపంలో లేదా పద్ధతిలో అంచనా వేయడం నిషేధం.. దీనికి విరుద్దంగా చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126ఏను ఉల్లంఘించడమే.. ఇటువంటి అంచనాల ద్వారా ఓటర్లు వివిధ రాజకీయ పార్టీలకు ప్రభావితం కాకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొంది.


By October 16, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ec-says-exit-poll-ban-applies-to-astrologers-tarot-readers-analysts-too-in-bihar-elections/articleshow/78692396.cms

No comments