Breaking News

ప్రపంచానికి ఊరట కలిగించే మరో వార్త.. ఆశాజనకంగా ఆక్స్‌ఫర్డ్ టీకా!


కరోనా వైరస్‌ మహమ్మారిని నిలువరించే టీకా కోసం సాగిస్తోన్న ప్రయత్నాల్లో ఊరట కలిగించే మరో విషయం వెల్లడయ్యింది. ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో కొనసాగుతుండగా.. ఫలితాలు అశాజనకంగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ఇది శుభపరిణామమని పరిశోధకులు వ్యాఖ్యానించారు. ప్రయోగదశల్లో ఉన్న ఈ వ్యాక్సిన్‌.. జెనెటిక్‌ సూచనలు పాటిస్తుందో? లేదో అనే విషయాన్ని తెలుసుకునేందుకు బ్రిస్టల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఇటీవలే అభివృద్ధి చేసిన నూతన పద్ధతులను వినియోగించి, రోగ నిరోధకతను ఏవిధంగా ఉత్తేజపరుస్తుందోననే విషయాలు సవివరంగా, అత్యంత స్పష్టంగా తెలుసుకున్నారు. ఈ పరిశోధన ఫలితాలను‘రిసెర్చ్‌ స్క్వేర్‌’జర్నల్‌లో ప్రచురించారు. మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత జన్యు సూచనలను ఈ టీకా పాటిస్తుందా? లేదా? అనే విషయం తెలుసుకోవడంలో ఈ పరిశోధన ఎంతో ముఖ్యమైందని బ్రిస్టల్స్‌ స్కూల్‌ ఆఫ్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ మెడిసిన్‌(సీఎంఎం) వైరాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ డేవిడ్‌ మాథ్యూస్‌ వెల్లడించారు. ఇటువంటి స్పష్టమైన సమాచారాన్ని ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ ఇవ్వలేకపోయింది. కానీ, ప్రస్తుతం నూతన సాంకేతికత సహాయంతో వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణను తెలుసుకున్నాం. ప్రతిపనిని మేము ఊహించినట్లుగానే నిర్వహిస్తోన్నట్లు పరిశోధనలో తేలింది’ అని మాథ్యూస్‌ పేర్కొన్నారు. ఇది వైరస్‌పై పోరులో శుభపరిణామమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ సంస్థలకు ఉపయుక్తమైన కీలక సమాచారాన్ని ఈ పరిశోధన అందజేస్తుందని వ్యాఖ్యానించారు. క్రాస్-డిసిప్లినరీ సహకారానికి ఇది ఒక అద్భుత ఉదాహరణ.. టీకా మానవ కణ లోపలికి చేరినప్పుడు సరిగ్గా ఏమి చేస్తుందో పరిశీలించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సారాహ్ గిల్బర్ట్ అన్నారు. పెద్ద మొత్తంలో స్పైక్ ప్రోటీన్ ఖచ్చితత్వంతో ఉత్పత్తి అవుతున్నట్టు అధ్యయనం నిర్ధారిస్తుంది.. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో టీకా విజయాన్ని వివరించడానికి తోడ్పడుతుందని ఆమె అన్నారు.


By October 23, 2020 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/astrazeneca-oxford-covid-19-vaccine-doing-everything-expected-bristol-study-finds/articleshow/78819680.cms

No comments