తమిళనాడులో దారుణం.. దళితురాలని మహిళా సర్పంచ్‌ను కిందే కూర్చోబెట్టారు
గ్రామ పంచాయతీ సమావేశంలో సభ్యులంతా కుర్చీలపై కూర్చుని, అణగారిన వర్గానికి చెందిన సర్పంచ్‌ను మాత్రం కిందే కూర్చోబెట్టిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దళితురాలనే కారణంతో ప్రెసిడెంట్‌ను కింద కూర్చోబెట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని తెర్‌కుత్తిట్టై గ్రామానికి చెందిన దళిత మహిళ రాజేశ్వరి శరవణకుమార్ (37) గత జనవరిలో పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మొత్తం గ్రామంలో 600 వరకు కుటుంబాలు ఉండగా.. వీరిలో 100 కుటుంబాలు షెడ్యూల్డ్ కులాలు, మిగతావి వన్నియార్ కులానికి చెందినవారే. ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశాల్లో మిగతా సభ్యులంతా, కుర్చీలపై ఆసీనులైతే.. రాజేశ్వరిని మాత్రం కిందనే కూర్చొమనేవారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివక్షపూరిత చర్యకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఫోటో జులై 17న జరిగిన పంచాయతీ సమావేశం నాటిది. ఈ విషయం గురించి రాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కులాన్ని కారణంగా చూపి ఉప-సర్పంచ్ మోహన్ రాజ్ ఈ విధంగా కింద కూర్చోబెట్టారు. అంతేకాదు జెండా ఎగురవేయడానికి కూడా నన్ను అనుమతించడు. వాళ్ల నాన్నతోనే ఆ కార్యక్రమం పూర్తి చేయిస్తాడు. నేను ఈ పదవికి ఎంపికైన నాటి నుంచి ఏడాది కాలంగా అగ్ర వర్ణ పెద్దలు చెప్పినట్లుగానే వింటున్నాను. అయినా వాళ్లు నన్ను అవమానిస్తూనే ఉన్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో దేశంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉప-సర్పంచ్ మోహన్ రాజ్, పంచాయతీ సెక్రెటరీ సింధూజలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. సింధూజను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మోహన్ రాజ్ కోసం గాలిస్తున్నారు. ‘జరిగిన సంఘటన గురించి మాకు తెలిసింది.. పంచాయతీ కార్యదర్శిపై చర్యలను ప్రారంభించాం.. సంఘటనను నివేదించడంలో విఫలమైనందుకు ఆమెను విధుల నుంచి తప్పించాం.. ఎస్సీ / ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు’ అని కడలూరు కలెక్టర్ చంద్రశేఖర్ శాఖమూరి అన్నారు.
By October 11, 2020 at 08:39AM
No comments