మహిళా మంత్రిని ‘ఐటమ్’ అంటూ నోరు జారిన మాజీ సీఎం.. రేగుతోన్న దుమారం
మహిళా మంత్రిపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఇమార్తీ దేవిని ‘ఐటమ్’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. కమల్‌నాథ్‌పై బీజేపీ నేతలు ఎదురుడాది ప్రారంభించారు. ‘దబ్రా’ ఉప-ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ నాథ్ మాట్లాడుతూ...‘ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజే సాధారణ వ్యక్తి.. ఆమె లాగా కాదు. ఆమె పేరేమిటో? నా కంటే మీకే బాగా తెలుసు.. ఆమె ఐటమ్’ అంటూ కమల్‌నాథ్ నోరు జారారు. తన కేబినెట్‌లోని మహిళా మంత్రిపై కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక్కసారి షాక్‌కు గురయ్యా. ఓ సీనియర్ రాజకీయ వేత్తగా ఉన్న కమల్‌నాథ్ ఓ మహిళా మంత్రిని కించపరిచేలా మాట్లాడటం ఏమిటి? ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. మహిళలను, దళితులను అగౌరవ పరిచేలా ఈ వ్యాఖ్యలున్నాయి.. కేవలం ఇమార్తీ దేవిని మాత్రమే కాదు మధ్యప్రదేశ్ మహిళలను అవమానించినట్టే.. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కమల్ నాథ్ నోటి నుంచి అభ్యంతరకర పదాలు రావడం బాధాకరం.. మహాభారతంలో ద్రౌపదిని అవమానిస్తే ఏం జరిగిందో తెలుసు.. దీనిని ప్రజలు సహించరు’ అని శివరాజ్ సింగ్ మండిపడ్డారు. కమల్‌నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇది కాంగ్రెస్ సిద్ధాంతమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌పై ద్విగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నేను ఇంకా మర్చిపోలేదు.. ప్రస్తుతం బీజేపీ మహిళా నేతపై కమల్‌నాథ్ వ్యాఖ్యలు, అజయ్ సింగ్ జలేబీ వ్యాఖ్యలను బట్టి మహిళలకు కాంగ్రెస్ ఎంత గౌరవం ఇస్తుందో అర్ధమవుతుంది’అని సింధియా ధ్వజమెత్తారు. మరోవైపు మంత్రి ఇమార్తి దేవీ మాట్లాడుతూ...‘ఓ పేద కుటుంబంలో పుట్టడమే నేను చేసి తప్పా? నేను దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అందులో నా తప్పేముంది? ఇలాంటి వ్యక్తులకు మధ్యప్రదేశ్‌లో స్థానం లేకుండా చేయాలి.. పార్టీ నుంచి ఆయనను తొలిగించాలని సోనియా గాంధీని డిమాండ్ చేస్తున్నా.. ఆమె కూడా ఓ మహిళ, ఓ తల్లి.. తన కుమార్తెపై ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా?’ అని ఇమార్తి దేవి నిలదీశారు.
By October 19, 2020 at 12:19PM
No comments