బిహార్ ఒపీనియన్ పోల్: తగ్గిన నితీశ్ ప్రభ.. దూకుడుమీదన్ను తేజస్వీ, హంగ్ దిశగా ఫలితాలు?
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వేలో ఎన్డీయే మెజార్టీ సీట్లను దక్కించుకుంటుందని తేలింది. అయితే, లోక్ జనశక్తి, జీఎస్డీఎఫ్ కూటమి భారీగా ఓట్లు చీల్చే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఇదే జరిగితే ఫలితాలు హంగ్ దిశగా మారే అవకాశం ఉంది. బీజేపీ-జేడీయూ కూటమి (ఎన్డీయే)కి 38 శాతం, ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్(మహాకూటమి)కి 32 శాతం, ఎల్జేపీకి 6 శాతం, జీఎస్ఎఫ్‌డీసీకి 7 శాతం, ఇండిపెండెంట్లు-ఇతరులకు 17 శాతం ఓట్లు లభించవచ్చని సర్వే అంచనా వేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ 31 శాతం మంది మద్దతు తెలిపితే, తరఫు సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ అనూహ్యం గా పుంజుకున్నారు. ఆయనకు 27 శాతం మంది మద్దతు ఉన్నట్టు సర్వే పేర్కొంది. లాలూ వారసుడిగా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న తేజస్వీ ప్రజాదరణను పుంజుకొన్నారని, గత ఐదేళ్లలో లాలూ కుటుంబం 21 శాతం ఆదరణ సాధించిందని సర్వే వివరించింది. నితీశ్‌కు 31 శాతం ఉంటే.. లాలూ కుటుంబానికి 30 శాతం మంది మద్దతుగా ఉన్నారు. ఉపేంద్ర కుశ్వాహా-మాయావతి-అసదుద్దీన్ ఒవైసీ కూటమి కూడా భారీగా ఓట్లు చీలుస్తుందని సర్వే తెలిపింది. దీని వల్ల ఎన్డీయేకు లబ్ది కలుగుతుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం ఎన్‌డీయేకి 133-143, మహాకూటమికి 88-98, ఎల్జేపీకి 2-6, ఇతరులు 6-10 స్థానాలను చేజిక్కించుకుంటారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయేలో జేడీయూ కంటే బీజేపీకి మద్దతు పెరిగినట్టు సర్వేలో గుర్తించారు. అంతేకాదు, ఎల్జేపీ వల్ల జేడీయూ భారీగా నష్టపోయే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఇక, సర్వేలో పాల్గొన్న 24 శాతం మంది మాత్రం ఎవరికి ఓటేస్తామనే విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. కాబట్టి, ఈ 24 శాతం మంది ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలతో పోల్చితే నితీశ్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2015లో 80 శాతం మందికిపైగా సంతృప్తి వ్యక్తం చేయగా.. 2010లో ఇది 77 శాతంగా ఉంది. ప్రస్తుత ఇది గణనీయంగా తగ్గిపోయి 52 శాతానికి పడిపోయింది. ఐదేళ్లలో 35 శాతం వరకు క్షీణించింది. 2015లో నితీశ్ ప్రభుత్వ తీరుపై 18 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. ప్రస్తుతం 44 శాతానికి చేరింది. నీతిశ్ ప్రభుత్వ తీరుపై 51 శాతం, మోదీ నాయకత్వంలో కేంద్రం పాలనపై 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
By October 21, 2020 at 07:39AM
No comments