Breaking News

ట్విట్టర్ చర్య క్రిమినల్ నేరమే.. ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది: పార్లమెంటరీ ప్యానెల్


లొకేషన్ సెట్టింగ్స్‌‌లో లడఖ్‌లోని లేహ్‌ ప్రాంతాన్ని చైనా భూభాగంగా చూపించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విటర్ ఇచ్చిన వివరణ సరిపోదని జాయింట్ పార్లమెంటరీ కమిటీ బుధవారం వెల్లడించింది. ఈ వివాదంపై ట్విట్టర్ ఇండియా అధికారులను ప్రశ్నించిన అనంతరం కమిటీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ట్విటర్‌ ప్రతినిధులను వివరణ అనంతరం డేటా ప్రొటెక్షన్ బిల్లు(2019)పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించడంపై సంస్థ ఇచ్చిన వివరణ సరిపోదని కమిటీ ఏకాభిప్రాయంతో ఉందని ఆమె అన్నారు. అయితే, తమ కమిటీ ముందుకు హాజరైన అధికారులు..భారత్ సున్నితత్వాన్ని తమ సంస్థ గౌరవిస్తుందని చెప్పినట్టు పేర్కొన్నారు. ‘ఇది సున్నితత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది భారత దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు సంబంధించింది. లడఖ్‌ను చైనా భూభాగంగా చూపించడం క్రిమినల్ నేరానికి ఏ మాత్రం తక్కువ కాదు. దీని కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది’ అని ఆమె స్పష్టం చేశారు. ట్విట్టర్ చర్యలపై కొద్ది రోజుల కిందట నిరసనను తెలియజేస్తూ ఆ సంస్థ సీఈఓ జాక్‌ డోర్సేకు కేంద్రం లేఖ రాసింది. ‘భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని అగౌరవపర్చడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. చివరికి అది మ్యాపుల్లో అయినా సహించం. అలా చేయడం చట్టవిరుద్ధం కూడా. అలాంటి తీరు ట్విట్టర్‌కు అపఖ్యాతి తీసుకురావడంతో పాటు, ఆ సంస్థ తటస్థతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి’ అంటూ లేఖ ద్వారా ఆ చర్యను తీవ్రంగా ఖండించింది. దీనిపై ట్విట్టర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఇటీవలి జియో ట్యాగింగ్ సమస్యను మా బృందాలు వేగంగా పరిష్కరించాయి. మేము మా పని విషయంలో పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం.. మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు.


By October 29, 2020 at 06:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/twitter-defence-inadequate-says-parliamentary-panel-on-leh-in-china-location-settings/articleshow/78922788.cms

No comments