ముంబయి సహా కొంకణ తీరంలో అతి భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా కొంకణ్ తీరంలో గురువారం అతిభారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలోని ముంబై, థానే, పుణే, షోలాపూర్ సహా ఉత్తర కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు గురువారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం నుంచి భారీవర్షాల వల్ల ముంబై నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పుణే జిల్లా నింగాన్ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న 40 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇందాపూర్‌లో మరో ఇద్దరు వరదనీటిలో కొట్టుకుపోతుండగా సిబ్బంది కాపాడారు. ముంబైలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బీఎంసీ అధికారులు సూచించారు. దాదర్, పరేల్, లాల్‌బాగ్, మతుంగ, ఆంధేరి, సియాన్, కుర్లా, మలాడ్, బోరివలీలో ఉరుములు పిడిగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా మహారాష్ట్రలో అక్టోబరు 14 నుంచి 16 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్టోబరు 15న గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ముంబయి, థానే, పాల్ఘర్, పుణే, రాయగఢ్, అహ్మద్‌నగర్, రత్నగిరి, సతారా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ.. తాజాగా దానిని రెడ్ హెచ్చరికలుగా మార్చింది. ఐఎండీ ప్రకారం.. అక్టోబరు 15 ఉదయం 5.30 గంటల వరకు కొలబాలో 107 మిల్లీమీటర్లు శాంతాక్రూజ్‌లో 82.5 మిల్లీమీటర్లు, రామ్‌మందిర్ 48.5 ఎంఎం, మిరా రోడ్ 42.00, దహిసర్ 44 ఎంఎం, భయోందర్ 43.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
By October 15, 2020 at 09:29AM
No comments