జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
జమ్మూ కశ్మీర్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాల్లోని చింగామ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. చింగామ్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. సైన్యం రాకను గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కాల్పులను దీటుగా తిప్పికొట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సైన్యం కాల్పుల్లో గుర్తుతెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైనవారిని ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులనేది గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఆపరేషన్ కొనసాగిస్తోన్న సైన్యం.. ముష్కరుల కోసం గాలిస్తోంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కశ్మీర్‌లో విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోంది.
By October 10, 2020 at 08:28AM
No comments