హెచ్-1బీ వీసాపై నిషేధం.. ట్రంప్ ప్రభుత్వానికి కాలిఫోర్నియా కోర్టు ఝలక్
ఈ ఏడాది జూన్‌లో హెచ్-1బీ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులను కాలిఫోర్నియా న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన చర్యలు రాజ్యాంగ అధికార పరిధిని మించిపోయాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ట్రంప్ ఉత్తర్వులను రద్దుచేస్తూ ఈ మేరకు నార్తర్న్ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జస్టిస్ జెఫ్రీ వైట్ గురువారం ఆదేశాలు జారీచేశారు. వీసాలపై ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, జాతీయ రిటైల్ ఫెడరేషన్, టెక్‌నెట్ కోర్టులో వ్యాజ్యం దాఖలుచేశాయి. ఇందులో వాణిజ్య విభాగం, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకమైన నిపుణుల నియామాకాలను నిరోధించే వీసా నిషేధంపై ఈ తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని నేషనల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది. ‘మా పరిశ్రమలో ఆవిష్కరణలకు తోడ్పడే అగ్రశ్రేణి ప్రతిభావంతులను గుర్తించి, అభివృద్ధి చేయడానికి మిగతా ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ప్రస్తుతం కోర్టు నిర్ణయం అమెరికాలో ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్న తయారీదారులకు తాత్కాలిక విజయం’ అని నామ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ లిండా కెల్లీ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన స్థానికులను ఆదుకోడానికి హెచ్-1బీ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకు నిషేధిస్తున్నట్టు ట్రంప్ జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని ఐటీ, ఇతర సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సంక్షోభ సమయంలో వీసాలపై నిషేధం విధించడం వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత దిగజారుతుందని, నైపుణ్యం ఉన్నవారు దొరకడం కష్టమని పేర్కొంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఇమ్మిగ్రేషన్ విషయంలో వలసేతర విదేశీయుల ఉపాధికి దేశీయ విధానాన్ని రూపొందించడంలో అధ్యక్షుడికి హద్దులేని అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వదు. అటువంటి చర్యలు ఆర్టికల్-2 అధికారాలను అతిక్రమించడమేనని జడ్జి వైట్ తన 25 పేజీల ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. రెండు శతాబ్దాలకు పైగా ఆర్టికల్ -1 శాసన, న్యాయ వ్యవస్థ అనుసరించే విధానాలను తెలియజేస్తోందని న్యాయమూర్తి అన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌కు ఉంది.. అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు.
By October 02, 2020 at 09:12AM
No comments