Breaking News

ఐదు నెలల ముందే వీఆర్ఎస్.. రాజకీయాల్లోకి బీహార్ పోలీస్ బాస్?


గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. వీఆర్ఎస్‌కు పాండే చేసిన విజ్ఞ‌ప్తికి గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరితో ఆయన సర్వీసు ముగియనుండగా.. ఐదు నెలల ముందే స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అయితే, రాజకీయాల్లోకి ప్రవేశించి, త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో పోటీచేయడానికే ముందుగా వీఆర్ఎస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతో ఉన్న పాండే.. పదవీవిరమణకు సిద్ధమయ్యారనే ప్రచారం గత కొద్ది నెలలుగా జరుగుతోంది. పాండే బ్యాచ్‌కు చెందిన డీజీ సునీల్ కుమార్ జులై 31న పదవీవిరమణ చేసి, ఇటీవల జేడీయూలో చేరారు. ఈయన కూడా ఎన్నికల్లో పోటీచేయడానికి సముఖంగా ఉన్నట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం కేసుపై మీడియా ముందు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. పాండే వీఆర్ఎస్‌‌పై మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత హోం శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు- 1958 ప్రకారం మంగళవారం సాయంత్రం నంచి వీఆర్ఎస్ అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకునే తేదీ నుంచి కనీసం మూడు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పాండే అనుసరించారని తెలిపింది. గుప్తేశ్వర్ పాండే స్థానంలో ప్రస్తుత హోం గార్డ్, ఫైర్ సర్వీసెస్ విభాగం డీజీ ఎస్కే సింఘాల్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు హోం శాఖ మరో నోటిఫికేషన్ జారీచేసింది. 1987 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గుప్తేశ్వర్ పాండే గతేడాది జనవరి 31న బీహార్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 2009లోనూ పాండే వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా.. కొద్ది నెలల తర్వాత దానిని ప్రభుత్వం తిరస్కరించింది.


By September 23, 2020 at 01:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-dgp-gupteshwar-pandey-takes-voluntary-retirement-from-service-likely-to-contest-election/articleshow/78271703.cms

No comments