Breaking News

ఏపీ హైకోర్టులో కృష్ణంరాజు పిటిషన్.. ప్రభుత్వానికి నోటీసులు


సినీ నటుడు, బీజేపీ నేత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయత్నిస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇటు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ కింద తాను 39 ఎకరాలు ఇచ్చానని, ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని, దీంతో ప్రస్తుతం అమరావతిలో ఎకరం రూ.30లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని అశ్వనీదత్ తెలిపారు. తానిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం తన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని, భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించిన తర్వాతే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వనీదత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.


By September 29, 2020 at 10:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bjp-leader-and-veteran-actor-krishnam-raju-files-petition-ap-high-court-over-land-issue/articleshow/78377607.cms

No comments