Breaking News

తొలిసారి రాజ్యసభకు ఎన్నిక.. పార్లమెంట్ ముఖం చూడకుండానే కరోనాతో కన్నుమూసిన ఎంపీ


కరోనా మహమ్మారికి కాటుకు మరో ప్రజాప్రతినిధి బలయ్యాడు. తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన పార్లమెంట్ మెట్లు ఎక్కకుండానే కోవిడ్-19తో మృతిచెందాడు. కర్ణాటక రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ (55) కరోనాతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. తీవ్రమైన శ్వాససంబంధ సమస్యతో బాధపడుతోన్న ఆయన చికిత్స కోసం సెప్టెంబరు 2న బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. న్యుమోనియాతోపాటు శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతినటంతో ఐసీయూలో చేర్చారు. పది రోజులుపాటు ఐసీయూలోనే వెంటిలేటర్‌, ఎక్మోపై చికిత్స అందజేసినట్టు మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ మనీష్‌ రై తెలిపారు. అయితే, ఆయనను కాపాడటానికి వైద్యులు చేసిన చికిత్స ఫలించక గురువారం రాత్రి 10:31 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేయకముందే మృతి చెందినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్రపతి మొదలు కేంద్ర మంత్రులంతా తమ సంతాపాన్ని ప్రకటించారు. కానీ, ఆయన రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ట్విట్టర్‌లో సంతాపం తెలియజేస్తూ పెట్టిన పోస్టులను వెంటనే తొలిగించారు. రాయచూరు జిల్లాకు చెందిన అశోక్‌ గస్తీ జూన్‌లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.. జులై 22న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. కానీ, పార్లమెంట్‌లో అడుగుపెట్టకుండానే మృతిచెందడం బాధాకరం. గతంలో బూత్-లెవెల్ కార్యకర్తగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత గస్తీ మాట్లాడుతూ.. బూత్-లెవెల్ కార్యకర్త అయిన తనను గుర్తించి గొప్ప అవకాశం కల్పించారు.. ఓ సాధారణ కార్యకర్తకు ఇటువంటి గుర్తింపు బీజేపీలోనే సాధ్యం.. ఇది లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.. బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.


By September 18, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leader-ashok-gasti-who-1st-time-rajya-sabha-member-dies-of-covid-19/articleshow/78179846.cms

No comments