Breaking News

ముంబయి: థానేలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8 మంది మృతి


ముంబయి సమీపంలోని భివాండీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయానికి బిల్డింగ్‌లో 40 నుంచి 45 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇప్పటి వరకు 20 మందిని స్థానికులు రక్షించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మరో 20 నుంచి 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. థానేలోని భివాండీ పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు థానే మున్సిపల్ అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనేది ఖచ్చితంగా తెలియదని, 20 నుంచి 25 వరకు ఉంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. దాదాపు నెల రోజుల కిందట మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ఐదంతస్తుల భవనం కూలి 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రాయ్‌గఢ్‌ జిల్లాలోని మ్హణ్‌ ప్రాంతంలో ఏడేళ్ల కిందట నిర్మించిన భవనం కూలిపోయింది. ఈ భవనంలో 45 ఫ్లాట్లు ఉండ‌గా, 84 మంది నివాసం ఉంటున్నారు.


By September 21, 2020 at 07:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/eight-killed-many-feared-trapped-as-building-collapses-in-thanes-bhiwandi/articleshow/78225933.cms

No comments