Breaking News

భారత్ సాహసోపేత నిర్ణయం.. దక్షిణ చైనా సముద్రంలోకి రహస్యంగా యుద్ధ నౌక


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరికి చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విస్తరణవాద కాంక్షతో రగలిపోతున్న డ్రాగన్‌కు భారత్ ఊహించని ఝలక్ ఇచ్చింది. తాజాగా దక్షిణ చైనా సముద్ర జలాల్లో యుద్ధ నౌకను భారత్ మోహరించింది. గాల్వాన్ ఘర్షణ తర్వాత దూకుడు పెంచిన భారత్.. దేశ రక్షణ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ధీటుగా భారత్ తన యుద్ధ నౌక‌ను పంపింది. ఈ నౌక అక్కడే ఉండి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచింది. సమీపంలోని అమెరికా యుద్ధ నౌకలతో సంప్రదింపులు జరిపి సమాచారాన్ని పంచుకుంటోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను అత్యంత రహస్యంగా తరలించడం విశేషం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా, భారత్‌ సైనికాధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన చర్చల్లో దక్షిణ చైనా సముద్రంలోకి భారత్ యుద్ధ నౌక మోహరింపుపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన తర్వాత ప్రాదేశిక జలాల్లో యుద్ధ నౌకను భారత్ మోహరించడంపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అభ్యంతరం వ్యక్తం చేసింది’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా సముద్రంలో భారత్ తన యుద్ధనౌకను మోహరించడంతో చైనా నౌకాదళం, భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, హిందూ మహా సముద్రంలో యుద్ధ నౌకలను భారత్ భారీగా మోహరించింది. చైనా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని మలక్కా స్ట్రెయిట్స్‌పై నిఘాను పటిష్టం చేసింది. చైనా నౌకాదళం కదలికలపై భారత యుద్ధ నౌకలు కన్నేసి ఉంచాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ సన్నద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.


By August 31, 2020 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-navy-sent-warship-to-south-china-sea-after-galwan-clashes-report/articleshow/77843219.cms

No comments