Breaking News

పుల్వామా ఉగ్రదాడి: ఎన్ఐఏ ఛార్జ్ షీట్.. అత్యాధునిక పద్ధతిలో కీలక ఆధారాలు సేకరణ


ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్ర దాడి కేసును సవాల్‌గా తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ఆధారాలు సేకరించింది. ఆధునిక, సూక్ష్మ పద్ధతుల్లో ఆధారాలు సేకరించిన .. ఇందుకోసం డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ పరీక్షలు వినియోగించినట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌.. కారులో శక్తివంతమైన పేలుడు పదార్థాలు నింపుకుని సైనిక వాహన శ్రేణికిలోకి ప్రవేశించి ఢీకొట్టడంతో అంతా తునాతునకలయ్యాయి. దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా పోయాయి. ఉగ్రవాది వాడిన కారు ఎవరిదన్నది గుర్తించే వీల్లేకుండా దాని నంబరు నుజ్జునుజ్జయినా.. చివరికి ఫోరెన్సిక్‌ విధానంలో దానిని గుర్తించారు. అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన సజ్జాద్‌ భట్‌ దాని యజమానిగా తేల్చారు. అలాగే కారులో ఆత్మాహుతి దళ సభ్యుడి రక్త నమూనాలను అతని తండ్రి డీఎన్‌ఏతో సరిపోలడంతో ఆదిల్‌ అహ్మద్‌ దార్‌గా నిర్ధారించారు. ఈ దాడితో సంబంధం ఉన్న, ప్రస్తుతం ఛార్జిషీట్‌లో పేర్కొన్న 19 మందిలో ఏడుగురు ముష్కరులను భద్రతా దళాలు ఇప్పటికే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టాయి. పుల్వామా దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహ్మద్‌ విడుదల చేసి వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. ఆ వీడియో ఇంటర్‌నెట్‌ ఐపీ అడ్రస్ పాకిస్థాన్‌లో గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ చీఫ్ , అతడి సోదరుడు రౌఫ్ అస్గర్, వారి బంధువు అమ్మర్ అల్వీ, భారతీయుడిగా అనుమానిస్తున్న రౌఫ్ మాజీ బాడీ గార్డ్ మొహముద్ ఇస్మాయిల్ ఈ దాడికి సూత్రధారులుగా వ్యవహరించినట్టు తెలిపింది. మొత్తం 19 మంది నిందితులపై 13,500 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ మేనల్లుడు ఉమర్ ఫరూక్ భారత్‌లోకి 2018లో ప్రవేశించి, దాడికి ముందస్తు వ్యూహరచన చేసినట్టు పేర్కొంది. వాట్సాప్‌లో ఉగ్రవాదుల మధ్య జరిగిన సంభాషణలు, పంచుకున్న ఫొటోలు కూడా కేసు దర్యాప్తులో సహకరించాయి. ఈ క్రమంలో ఐఎస్ఐ, ఇతర దేశాల సంస్థల సహకారం కూడా తీసుకున్నట్టు ఎన్‌ఐఏ వివరించింది.


By August 26, 2020 at 06:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nia-charge-sheet-against-jem-chief-18-others-for-pulwama-terror-attack/articleshow/77753797.cms

No comments