Breaking News

రాజస్థాన్ సంక్షోభం: బీజేపీలో చేరికపై పైలట్ క్లారిటీ.. అనూహ్య నిర్ణయం


ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం మధ్య నెలకున్న ఆధిపత్య పోరు రాజస్థాన్‌లో ప్రభుత్వానికి సంకటంగా పరిణమించింది. తిరుగుబావుటా ఎగురవేసిన పైలట్... తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. దీంతో ఆయన బీజేపీలోకి వెళతారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆయన అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సీఎల్పీ సమావేశం జరగడానికి కొద్ది నిమిషాల ముందే తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కానీ, సీఎల్పీ సమావేశానికి తాను హాజరుకావడం లేదని సచిన్ పైలట్ శనివారం ప్రకటించారు. అయితే, ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. సరైన కారణాలు లేకుండా ఎవరైనా సమావేశానికి హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీచేయడానికి ఇదేమీ అసెంబ్లీలో జరిగే సమావేశం కాదని పైలట్ మద్దతువర్గాలు అంటున్నాయి. మరోవైపు, జైపూర్‌లో నేడు సీఎం, ఎమ్మెల్యేల సమావేశం జరిగే సమయానికి, న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పైలట్ సమావేశం కావాల్సివుంది. అయితే, కొద్దిసేపటి కిందట ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోవడం లేదని వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ వేచి చూసే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, తామేమీ ఆ పార్టీని చీల్చాలని భావించడం లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. సచిన్ సన్నిహిత వర్గాలు కూడా బీజేపీతో సంబంధాలపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. రాజస్థాన్‌లో ఏర్పడిన ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి రాహుల్ గాంధీయే కారణమని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దిశానిర్దేశం లేని రాజకీయాల వల్లే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీలోని నాయకుల పట్ల కార్యకర్తలకు నమ్మకం లేదు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది.. రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలు భారత్‌కు మద్దతుగా ఉండటంలేదు.. కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్‌లను వెనుకేసుకొచ్చేవిలా ఉన్నాయి.. అందుకే తమను నేతలు మోసం చేస్తున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు’ఆయన వ్యాఖ్యానించారు.


By July 13, 2020 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-crisis-dy-chief-minister-sachin-pilot-says-not-joining-bjp/articleshow/76934023.cms

No comments