ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
ఒడిశాలోని మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలో అడవుల్లో కూబింగ్ నిర్వహించింది. ఆదివారం ఉదయం 7.00 గంటల ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎదురుకాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు తప్పించుకున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందినవారిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది. ఘటనా స్థలంలో ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకీ, వివిధ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టులపై గతంలో ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. వీరు బంశధార-ఘుముసారా-నాగావళి (బీజీఎన్) డివిజన్‌కు చెందిన మావోయిస్టులగా గుర్తించారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్టు తెలుస్తోంది. పలువురు అగ్రనేతలు కూడా తప్పించుకున్నట్టు భావిస్తున్నారు. కూబింగ్ ఇంకా కొనసాగుతోంది.
By July 05, 2020 at 12:18PM
No comments