Breaking News

దేశంలో మరింత ఉద్ధృతంగా కరోనా వైరస్.. మరో రికార్డు భారత్ సొంతం


దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 30వేలు దాటింది. దీంతో అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. ఇక, గురువారం నాటి కేసుల్లో మరో రికార్డు నమోదయ్యింది. దేశవ్యాప్తంగా కొత్తగా 48వేల మందికిపైగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో 750 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో నమోదయిన కరోనా మరణాల్లో ఇవే అత్యధికం. వారం రోజుల కిందట 25వేలుగా ఉన్న కరోనా మరణాలు.. మరో ఏడు రోజుల్లో 30వేలు దాటాయి. అంతకు ముందు 20 వేల నుంచి 25 రోజులకు చేరడానికి 10 రోజులు, 15 వేల నుంచి 20వేలకు చేరడానికి 11 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం కరోనా మరణాల్లో ఫ్రాన్స్‌ను (30,172) భారత్ అధిగమించింది. గురువారం దేశంలో 48,285 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. కేవలం రెండు రోజుల్లో 95వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కొత్తగా 9,895 కేసులు నమోదు కాగా.. తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లో 7,998 కేసులు బయటపడ్డాయి. కేవలం రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో 14వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. రోజువారీ కేసుల్లో తమిళనాడు 6,472, కర్ణాటక 5,030, ఉత్తరప్రదేశ్ 2,529, బెంగాల్ 2,436, ఒడిశా 1,264, కేరళ 1,078, గుజరాత్ 1,078, ఝార్ఖండ్ 518, పంజాబ్ 441, చత్తీస్‌గఢ్ 286 కొత్త రికార్డులను నమోదుచేశాయి. మహారాష్ట్రలో గురువారం అత్యధికంగా 298 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాలు 12,854కి చేరాయి. భారత్‌లో కరోనా మృతుల రేటు 3.6 శాతం ఉండగా... మొత్తం కరోనా మరణాలు 40 శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ముంబయి నగరంలో ఇప్పటి వరకూ 5,930 మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ పాజిటివ్‌ కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి. గురువారం ఏకంగా 7,998 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల్లో వచ్చిన అత్యధిక కేసులు ఇవే. అంతేకాదు దేశంలోనే మహారాష్ట్ర తరువాత ఏపీలోనే ఒక్కరోజులో 7 వేల కేసులు దాటాయి.


By July 24, 2020 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-deaths-cross-30000-with-record-spike-of-750-on-thursday-in-india/articleshow/77139190.cms

No comments