Breaking News

కశ్మీర్‌: సీఆర్పీఎఫ్ వాహనంపై ఉగ్రదాడి.. ఓ జవాన్ సహ పౌరుడు మృతి


కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు వాహనంపై దాడికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ వాహనంపై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో మూడేళ్ల బాలుడిని సైన్యం కాపాడింది. చిన్నారికి బుల్లెట్లు తగలకుండా సురక్షితంగా అక్కడ నుంచి తప్పించారు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు, రాజౌరీ సెక్టార్‌‌లోని కేరి ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖను దాటి 400 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పులను సమర్ధంగా తిప్పికొట్టిన భారత సైన్యం.. ఓ ఉగ్రవాదిని హతమార్చింది. అతడి వద్ద ఏకే 47, ఓ మ్యాగిజైన్ స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


By July 01, 2020 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jawan-and-civilian-lost-their-lives-in-terrorists-fired-crpf-patrolling-party-in-sopore/articleshow/76723267.cms

No comments