Breaking News

ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లోనే.. తాజా నివేదిక


ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా దేశంలో పులుల గణాంకాల నివేదికను ఆయన మంగళవారం విడుదల చేశారు. ‘ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. ఇందుకు భారత్ ఎంతో గర్వపడుతోంది. పులుల సంఖ్యను పెంచడానికి టైగర్‌ రిజర్వులు ఉన్న 13 దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. 1973లో మనకు కేవలం తొమ్మిది టైగర్‌ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50కి చేరింది. ప్రపంచ జీవన వైవిధ్యంలో ఎనిమిది శాతం భారత్‌లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ భూభాగంలో 2.5 శాతం, వర్షపాతంలో నాలుగు శాతం, మానవ జనాభాలో 16 శాతం వాటా కలిగిన భారత్.. ప్రపంచ జీవవైవిధ్యంలో ఎనిమిది శాతం ఆక్రమించింది.. ఇందులో ప్రపంచ పులుల జనాభా 70 శాతం ఉంది’ అని అన్నారు. కేవలం పులుల సంరక్షణలోనే కాదు, ఇతరు వన్యప్రాణుల రక్షణలోనూ భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో ఆకర్షణలు భారత్ సొంతమని, వాటిలో వన్యప్రాణి సంపద ఎంతో ముఖ్యమైనదని మంత్రి అన్నారు. భారత్‌లో 30 వేల ఏనుగులు, 3 వేల ఖడ్గమృగాలు, 500 సింహాలు ఉన్నాయని ఈ సందర్భంగా జావదేకర్ వెల్లడించారు. ‘మొత్తం 12 టైగర్ రిజర్వ్ దేశాలతో శిక్షణ, సామర్థ్యం పెంపొందించడం, పులుల సంతతిని వాస్తవంగా నిర్వహించడంలో నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాం’ అన్నారు. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, మాయన్మార్, నేపాల్, రష్యా, థాయ్‌లాండ్, వియత్నాం, లావో పీడీఆర్ దేశాల్లో రిజర్వ్ ఫారెస్ట్‌లు ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం అత్యధికంగా పులుల కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక రెండో స్థానంలో ఉంది. మొత్తం 50 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ల్లో మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2018 పులుల గణన గిన్నిస్‌ బుక్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. కెమెరాల ద్వారా బంధించిన అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా గిన్నిస్‌బుక్‌ దీనిని గుర్తించి ధృవీకరణ పత్రం జారీ చేసింది. టైగర్ రిజర్వ్‌లున్న మొత్తం 13 దేశాల్లో పులుల సంఖ్య 2010 నాటికి అత్యల్ప సంఖ్యకు చేరుకోవడంతో పులుల సంరక్షణపై సెయింట్ పీటర్స్‌బర్గ్ తీర్మానం అమలుచేయాలని నిర్ణయించాయి. భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పదేళ్లలో పులుల సంఖ్య 1,796 నుంచి 2,967కి చేరింది.


By July 29, 2020 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-accounts-for-70-of-worlds-tigers-says-prakash-javadekar-releases-new-report-on-wild-cats/articleshow/77235072.cms

No comments