వక్రబుద్ధి పోనిచ్చుకోని డ్రాగన్.. సరిహద్దుల్లో 40వేల సైన్యాలను తరలించిన చైనా
సరిహద్దుల్లో సైన్యాల ఉపసంహరణకు అంగీకరించినట్టు నటించిన డ్రాగన్.. మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్‌మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను మోహరించింది. తూర్పు లడఖ్ వద్ద బలగాల వెనక్కు మళ్లింపునకు సంబంధించి తుది దశ చర్చలు అసంపూర్ణంగా ఉన్న తరుణంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. కదలికలతో భారత్ కూడా అప్రమత్తమయ్యింది. సీపీఎల్ఏకు దీటుగా అదనపు బలగాలు, యుద్ధ సామగ్రిని అరుణాచల్‌కు తరలిస్తోంది. ఇందు కోసం ఇతర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని శాంతియుత ప్రాంతాల నుంచి రిజర్వ్ బలగాలను సమీకరిస్తోంది. వాస్తవానికి జులై నుంచి అక్టోబరు వరకు అరుణాచల్ వైపు భారత బలగాలు పెద్దఎత్తున తరలించడం సర్వసాధారణమే. కానీ, ఈసారి మాత్రం పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. సరిహద్దు వెంబడి చైనా కదలికలు గణనీయంగా ఉన్నాయి. వైమానిక రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది వాహనాలు, సూదర ప్రాంతాల నుంచి ప్రయోగించే ఫిరంగి వంటి భారీ ఆయుధాలతో కూడిన దాదాపు 40,000 మంది సైనికుల తరలింపుతో చైనా మరో కుట్రకు తెరతీసిందనే సంకేతాలు వెలువడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లడఖ్‌లో బలగాల తరలింపునకు సంబంధించిన చర్చలు పూర్తయినా.. ఎటువంటి పురోగతి లేదని వ్యాఖ్యానించాయి. తూర్పు లడఖ్‌లోని ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెనక్కు మళ్లడానికి చైనా సైన్యం విముఖత చూపుతోంది.. సిరిజాప్‌లోని శాశ్వత ప్రదేశాలకు తిరిగి వెళ్లిన డ్రాగన్ సైన్యం ఇదే ప్రాంతంలో ఒక అబ్జర్వేషన్ పోస్ట్‌ను ఏర్పాటుచేయాలని భావిస్తోందని తెలిపాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి కట్టుబడి ఉన్నట్లు వివిధ దశల్లోని చర్చల్లో చైనా ప్రకటించినా ఇప్పటికీ లడఖ్ నుంచి తన బలగాలను ఉపసంహరించడం లేదు. అంతేకాదు, మరింత మంది సైనికుల్ని అక్కడ మోహరిస్తోంది. బలగాలతోపాటు వైమానిక రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి పోరాట సామగ్రిని అక్కడకు తరలిస్తూనే ఉంది. భారత్, చైనాల మధ్య నిర్ణయించిన సరిహద్దు విభజన రేఖ (మెక్‌మోహన్ రేఖ)ను డ్రాగన్ గుర్తించడం లేదు. దీంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని 65,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తున్న చైనా.. దీనిని దక్షిణ టిబెట్‌గా చెబుతోంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే పశ్చిమాన తవాంగ్, తూర్పున వలోంగ్ మార్గాలు ఉన్నాయి. 1962 ఘర్షణల్లోనూ చొరబాట్లకు ఈ రెండు ప్రాంతాలపైనే డ్రాగన్ దేశం దృష్టి సారించింది.
By July 23, 2020 at 07:34AM
No comments