Breaking News

బెంగళూరులో 3,300 మంది కోవిడ్ రోగులు మిస్సింగ్.. వారంతా ఏమైనట్టు?


ఇప్పటి వరకూ ముంబయి, చెన్నై నగరాలను వణికించిన కరోనా మహమ్మారి.. బెంగళూరు నగరంపై తాజాగా పంజా విసురుతోంది. అక్కడ రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. కాగా, బెంగళూరులో కోవిడ్-19 పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిన 3 వేల మందికిపైగా కనిపించకుండా పోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. వీరి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ‘వైరస్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన 3,338 మంది కనిపించకుండా పోయారు.. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం’ అని బెంగళూరు మహానగర పాలిక కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ అన్నారు. వీళ్లంతా ల్యాబ్‌లకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. పోలీసుల సహకారంతో కొందర్ని గుర్తించామని, మిగతా వాళ్లను పట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. పాజిటివ్ వచ్చినవారి కదలికలు గుర్తించడానికి తమకు మార్గం లేదని, వారికి వైరస్ నిర్ధారణ అయిన తర్వాత తమను తాము నిర్బంధించుకున్నారో లేదో ఎవరికీ తెలియదని అధికారులు అన్నారు. కర్ణాటకలో శనివారం 5,075 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసులు లక్షకు చేరువయ్యాయి. మరో 72 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాలు 1,796కి చేరాయి. ఇప్పటి వరకూ మొత్తం 90,942 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. రికవరీ రేటు తక్కువగా ఉంది. 33,752 మంది కోలుకోగా.. మరో 55,638 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం బెంగళూరులో 2,036 కొత్త కేసులు బయటపడగా... బెలగావీలో 341, బళ్లారి 222, దక్షిణ కన్నడ 218 కేసులు నమోదయ్యాయి. మొత్తం బెంగళూరులో 43,503 కేసులు నిర్ధారణ కాగా.. 31,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో చోటుచేసుకుంటున్న కరోనా మరణాల్లో గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారే అధికంగా ఉన్నారు. దేశ ఐటీ రాజధానిలో గత రెండు వారాల్లోనే 27వేల కేసులు నమోదయ్యాయి.


By July 26, 2020 at 12:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-3000-covid-patients-in-bengaluru-untraceable-says-bbmp-commissioner/articleshow/77179615.cms

No comments