Breaking News

ముంబయి: తాజ్ హోటల్‌కు పాక్ నుంచి బాంబు బెదిరింపు కాల్.. అలర్ట్


ముంబయి‌లోని తాజ్ హోటల్‌‌కు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో తాజ్ హోటల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచినట్టు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి కరాచీ నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించారు. ఈ ఫోన్ కాల్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, 2008 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులు తాజ్ హోటల్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హోటల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో పోలీసులు సహా విదేశీయులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, జమ్మూ-కశ్మీర్‌లో సైనిక క్యాంపుపై సోమవారం సాయంత్రం ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని.. సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మధ్య కశ్మీర్‌ జిల్లా బుద్గాంలోని ఛత్తర్‌గమ్‌లో ప్రాంతంలో ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన శిబిరంపై ముష్కరులు యూజీబీఎల్‌ గ్రెనేడ్‌ లాంఛర్లు వదిలినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది లక్ష్యం తప్పి శిబిరానికి సమీపంలో పేలిందని దీంతో సైనికులకు ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఘటనా ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించుకు పోయారని.. వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా, సోమవారం స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ భవనం జరిగిన దాడిలో నలుగురు ముష్కరులు సహా 11 మంది మృతిచెందారు. స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి ప్రవేశించిన ముష్కరులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు, పాక్ సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించి ముష్కరులను కాల్చి చంపింది.


By June 30, 2020 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/taj-hotel-receives-bomb-threat-call-from-pakistan-security-tightened-in-mumbai/articleshow/76704189.cms

No comments